అయ్యో డికాక్‌.! ఈగ ఎంత పనిచేసింది

1 Apr, 2018 12:29 IST|Sakshi
డికాక్‌ పై వాలిన ఈగ

ఈ ఘటనపై ఐసీసీ దర్యాప్తు జరపాలి

సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ సెటైర్స్‌

జోహన్నెస్‌బర్గ్‌ : వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియోపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయి. 

దక్షిణాఫ్రికా-ఆసీస్‌ చివరి టెస్టు రెండో రోజు ఆటలో ఓ ఈగ సఫారీ వికెట్‌ కీపర్‌ డికాక్‌ ఏకాగ్రతను దెబ్బతీసింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ షాన్‌ మార్ష్‌ను స్టంప్‌ అవుట్‌ మిస్‌ చేసే అవకాశం కోల్పోయాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేశవ్‌ మహరాజ్‌ వేసిన 30 ఓవర్‌లో క్రీజు దాటి వచ్చిన షాన్‌ మార్ష్‌ ఆఫ్‌ వికెట్‌ మీదుగా వచ్చిన బంతిని మిస్సయ్యాడు. అయితే ఇక్కడ కీపర్‌ డికాక్‌ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు

అంతకు ముందే అద్భుత క్యాచ్‌తో ఉస్మాన్‌ ఖాజాను పెవిలియన్‌ చేర్చిన డికాక్‌ సులువై స్టంప్‌ ఔట్‌ మిస్‌ చేయడం ఏమిటని అందర అశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఓ ఈగ డికాక్‌ భుజాలపై వాలడం.. అతను ఏకాగ్రత కోల్పోయి స్టంప్‌ ఔట్‌ మిస్‌ చేయడం టీవీ రీప్లేలో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ వీడియోపై అభిమానులు జోకులు పేల్చుతున్నారు. ఐసీసీ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని, డికాక్‌ కుట్రను బయటపెట్టాలని సెటైర్స్‌ వేస్తున్నారు. మరి కొంత మంది ఆ ఈగ డికాక్‌ను ఏప్రిల్‌ ఫూల్‌ చేసిందని కామెంట్‌ చేస్తున్నారు.

మార్కరమ్‌ అద్భుత సెంచరీకి తోడు బవుమా (95 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 488 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ను ఫిలాండర్‌ దెబ్బతీశాడు.  దీంతో ఆసీస్‌ 96 పరుగులకే కీలకమైన 6 వికెట్లను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో సస్పెన్షన్‌కు గురైన స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ స్థానంలో ఈ టెస్టులో బరిలోకి దిగిన హ్యాండ్స్‌కోంబ్‌ (0), రెన్‌షా (8), బర్న్స్‌ (4) విఫలమయ్యారు. ఈ ముగ్గురు కలిసి కేవలం 12 పరుగులే చేశారు. 

మరిన్ని వార్తలు