కుప్పకూలిన శ్రీలంక.. భారత్‌కు భారీ ఆధిక్యం

28 Jul, 2017 13:22 IST|Sakshi
కుప్పకూలిన శ్రీలంక.. భారత్‌కు భారీ ఆధిక్యం
శ్రీలంక 291 ఆలౌట్‌
 
గాలె: భారత్‌-శ్రీలంక తొలి టెస్టులో మూడో రోజు ఆటలో లంక 291 పరుగులకే కుప్పకూలింది. లంచ్‌ సమయానికి  8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసిన లంక బ్యాట్స్‌మెన్‌ మరో రెండు పరుగులు జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో కుమారా(2) క్లీన్ బౌల్డ్‌ కావడంతో లంక ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డ అసేల గుణరత్నే మ్యాచ్‌కు దూరం కావడంతో లంక 10 మందితోనే బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. ఇక ఒంటరి పోరాటం చేసిన  పెరీరా (92 నాటౌట్‌) శతకం చేజారింది.
 
ఓవర్‌నైట్‌ స్కోరు 154/5తో లంక బ్యాట్స్‌మెన్‌ మాథ్యూస్‌(54 బ్యాటింగ్‌), దిల్రువన్‌ పెరీరా(6 బ్యాటింగ్‌) ఇన్నింగ్స్‌ ఆరంభించారు. ఆచితూచి ఆడిన వీరిద్దరు జట్టు స్కోరు రెండు వందలు దాటించారు. అనంతరం జడేజా బౌలింగ్‌లో సెంచరీ దిశగా దూసుకెళ్లున్న మాథ్యూస్‌ (89) స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. జడ్డూ వేసిన 59 ఓవర్‌లో మాథ్యూస్‌ విరాట్‌ కోహ్లీకి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ 6 వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
 
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన లంక కెప్టెన్‌ హెరాత్‌  క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకో లేకపోయాడు జడేజా వేసిన 66 ఓవర్లో రహానే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ప్రదీప్‌ కూడా పాండ్యా బౌలింగ్‌లో బౌల్డ్‌ అ‍వ్వడంతో శ్రీలంక 280 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. మరో 11 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్‌ కోల్పోయింది. దీంతో భారత్‌ 309 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇ‍న్నింగ్స్‌ ప్రారంభించింది. భారత బౌలర్లలో జడేజా(3), షమీ(2), పాండ్యా, ఉమేశ్‌, అశ్విన్‌ తలో వికెట్‌ దక్కిచ్చుకున్నారు.

 

మరిన్ని వార్తలు