కేవలం ఆసీసే కాదు.. ఇంగ్లండ్‌ కూడా

26 Jun, 2019 20:54 IST|Sakshi

లండన్‌: రెండు వరుస పరాజయాలు చవిచూసినంత మాత్రాన టైటిల్‌ రేసు నుంచి ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు తప్పుకోలేదని ఆస్ట్రేలియా పేసర్‌ జాసన్‌ బెహ్రాన్‌డార్ఫ్‌ అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో ఆసీస్‌ టైటిల్‌ వేటలో ముందంజలో ఉందన్నాడు. అయితే ఓటములు చెందినంత మాత్రాన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనవేయడానికి వీల్లేదని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో ఆసీస్‌తో పాటు ఇప్పటికీ ఇంగ్లండ్‌ కూడా ఫేవరేట్‌ జట్టేనని తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నాడు.
‘అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు దక్కించుకోవడం అందులోనూ ప్రపంచకప్‌లో ఈ ఘనత అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌ అరంగేట్రపు మ్యాచ్‌లో శ్రీలంకపై అంతగా రాణించకపోవడంతో నన్ను పక్కకు పెట్టారు. అయితే ఈ సమయంలో కృంగిపోకుండా జట్టులోకి ఎలా తిరిగి రావాలిన ఆలోచించాను. దేశం తరుపున ఆడే అవకాశం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని అనుకునే వాడిని. అవకాశం వచ్చింది. నా వంతు పాత్ర పోషించాను’అంటూ బెహ్రాన్‌డార్ఫ్‌ పేర్కొన్నాడు.

మంగళవారం క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 64 పరుగుల తేడాతో ఆసీస్‌ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఇది మూడో ఓటమి. అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్‌, పూర్వవైభవం లేక బలహీన పడ్డ శ్రీలంక జట్లపై ఓడిపోవడంతో పాటు తాజాగా ఆసీస్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓడిపోవడంతో ఆ జట్టుపై అంచనాలు తగ్గాయి. మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్‌లోనే ఓడిపోవడంతో గమనార్హం.

చదవండి:
ఆసీస్‌ విలాసం ఇంగ్లండ్‌ విలాపం
మ్యాక్స్‌వెల్‌.. వెరీవెల్‌
 

మరిన్ని వార్తలు