ఆర్సీబీ ఫ్యాన్స్‌గా తట్టుకోలేపోతున్నాం రా.!

1 Apr, 2019 12:10 IST|Sakshi

కోహ్లిసేనపై ఫ్యాన్స్‌ ఫైర్‌

హైదరాబాద్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఉప్పల్‌ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వార్నర్‌, బెయిర్‌ స్టోల శతకాల దాటికి కనీస పోరాటపటిమ కనబర్చకుండా కొట్టుకుపోయింది. ఏకంగా 118 పరుగులతో తేడాతో చిత్తయింది. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ జట్టుకు సారథ్యం వహిస్తుండటం, ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ ఈ జట్టులోనే ఉండటంతో ఆర్సీబీకి అభిమానుల సంఖ్య ఎక్కువే. గత రెండు సీజన్లలో పూర్తి నిరాశజనక ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అట్టడుగులో నిలిచిన ఆర్సీబీ ఈ సారి పుంజుకుంటుందని వారంతా వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఓటమికి పిచ్‌ కారణమని సర్దుకున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి దురదృష్టమనుకున్నారు.

కానీ తాజా హైదరాబాద్‌తో ఎదురైన ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ ఘోరపరాభావాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆర్సీబీ అభిమానులుగా తట్టుకోలేకపోతున్నామని సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లిసేన ఆటతీరుపై మండిపడుతున్నారు. 'ఈ సాలా కప్‌ కప్‌ నమ్‌దే' స్లోగన్‌ ఈసారి కూడా ఉత్తదేనా? అని నిట్టూరుస్తున్నారు. అసలు ఏమైంది ఆర్సీబీ ఆటగాళ్లకు.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసహనంతో కూడిన మీమ్స్‌తో కోహ్లిసేనపై దాడి చేస్తున్నారు. ప్రత్యర్థి 231 పరుగులు చేస్తే.. కనీసం పోరాటపటిమను కనబర్చకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ‘మీరు ఓటమిని తట్టుకుంటున్నారో ఏమో కానీ.. ఆర్సీబీ ఫ్యాన్స్‌గా మా వల్ల కావడం లేదు’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 2016 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ వరకు వెళ్లి సన్‌రైజర్స్‌ చేతిలో పరాజయం పాలైన ఆర్సీబీ.. ఆ తరువాత రెండు సీజన్లలో దారుణ ప్రదర్శనను కనబర్చింది.

మరిన్ని వార్తలు