భళా...  బెల్జియం

19 Jun, 2018 00:32 IST|Sakshi

3–0 తేడాతో పనామాపై  ఘన విజయం

లుకాకు అద్భుత ప్రదర్శన

సంచలనమేమీ లేదు... అరంగేట్ర జట్టు ప్రత్యర్థిని నిలువరించనూ లేదు... ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ను కొంత ఆసక్తికరంగానే ప్రారంభించినా కొత్త జట్టు పనామా తర్వాత తప్పులతో తడబడింది. దాని పోరాటం నామమాత్రమే అయింది. క్రమంగా పుంజుకున్న బెల్జియం అసలైన ఆటను బయటకు తీసింది. వరుస దాడులతో ఊపిరి సలపకుండా చేసింది. స్ట్రయికర్లు లుకాకు, మెర్టెన్స్‌ కళ్లు చెదిరే రీతిలో చేసిన గోల్స్‌తో విజయదుందుభి మోగించింది.   

సోచి: ప్రారంభ మ్యాచ్‌ తర్వాత ప్రపంచ కప్‌లో ఓ ఏకపక్ష మ్యాచ్‌. అరంగేట్ర పనామాపై బెబ్బులిలా విరుచుకుపడిన బెల్జియం 3–0 తేడాతో సునాయాస విజయం అందుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘జి’ మ్యాచ్‌లో ప్రత్యర్థి అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకున్న ఆ జట్టు పూర్తి ఆధిపత్యం చాటింది. మెరుపులా మెరిసిన స్ట్రయికర్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రొమేలు లుకాకు రెండు, డ్రియెస్‌ మెర్టెన్స్‌ ఒక గోల్‌ చేశారు. 

పోటీతోనే ప్రారంభమైనా... 
వాస్తవానికి బంతిపై నియంత్రణ, పాస్‌ల చేరవేతతో ప్రారంభంలో పనామా దీటుగా ఆడింది. మంచి డిఫెన్స్‌తో గోల్‌కు అవకాశం ఇవ్వలేదు. అటు బెల్జియం కూడా దాడులు చేయడంలో ఇబ్బందిపడింది. ఓ దశలో ఇద్దరు మినహా ఆ జట్టు ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి వెళ్లారు. అయినా స్కోరు చేయలేకపోయారు. దీంతో మొదటి భాగం గోల్‌ లేకుండానే ముగిసింది. అయితే, రెండో భాగం ప్రారంభంలోనే ఈ నిరీక్షణకు తెరపడింది. బెల్జియం ఒక్కసారిగా దూకుడు పెంచగా, పనామా క్రమంగా లయ తప్పింది. 47వ నిమిషంలో స్ట్రయికర్‌ డ్రీస్‌ మెర్టెన్స్‌... గోల్‌ పోస్ట్‌కు కొద్ది దూరంలో అందిన బంతిని చూడచక్కని రీతిలో స్కోరు చేసి బెల్జియంకు ఆధిక్యం అందించాడు.  ఇక్కడినుంచి గాడి తప్పిన పనామా ఒకటీ, అరా అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా ఎల్లో కార్డ్‌కు గురయ్యారు. మరోవైపు 69వ నిమిషంలో డిబ్రుయెన్‌ అందించిన క్రాస్‌ను స్ట్రయికర్‌ లుకాకు... డైవ్‌ చేస్తూ అద్భుతం అనేలా తలతో గోల్‌గా మలిచాడు. దీన్నుంచి తేరుకునేలోపే 75వ నిమిషంలో మరో దెబ్బకొట్టాడు. డిబ్రుయెన్, విట్సెల్‌ నుంచి అందిన పాస్‌లను ఈడెన్‌ హజార్డ్‌... లుకాకుకు చేరవేయగా అతడు వేగంగా పరుగెడుతూ కీపర్‌ పెనెడోను తప్పిస్తూ గోల్‌గా మార్చాడు. ఆరు నిమిషాల్లో రెండు గోల్స్‌ ఇచ్చుకున్న పనామా తర్వాత చేసేదేమీ లేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు ఐదుగురు ఎల్లోకార్డ్‌ను ఎదుర్కోవడం గమనార్హం.   

మరిన్ని వార్తలు