'ఆ లోటు పుణె జట్టులో కనబడింది'

22 May, 2017 18:02 IST|Sakshi
'ఆ లోటు పుణె జట్టులో కనబడింది'

హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ పోరులో గెలుపు అంచుల వరకూ వచ్చి చతికిలబడటం పట్ల రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.  తమ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకపోవడమే తుది పోరులో ఓటమి చెందడానికి ప్రధాన కారణంగా విశ్లేషించాడు.

'బెన్ స్టోక్స్ లేని లోటు కనబడింది. ఫైనల్ పోరుకు స్టోక్స్ ఉండి ఉంటే ఫలితం మరొరకంగా ఉండేది. స్టోక్స్ లేకపోవడం వల్ల మేము ఎక్సట్రా బౌలర్ తో బరిలోకి దిగాల్సి వచ్చింది. దాంతో బ్యాటింగ్ విభాగం బలహీనపడింది. ఆ క్రమంలోనే 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యాం. ఇక్కడ స్టీవ్ స్మిత్-రహానేల భాగస్వామ్యం తప్పితే, వేరే మంచి భాగస్వామ్యాలు రాలేదు. కీలక సమయాల్లో వరుసగా వికెట్లను కోల్పోతూ ఒత్తిడిలో పడ్డాం. దాంతో ముంబై ఇండియన్స్ కు దాసోహమయ్యాం' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

ముంబై ఇండియన్స్ తో జరిగిన ఆఖరి పోరులో పుణె పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. కేవలం స్మిత్, రహానేలు తప్పితే మిగతా ఆటగాళ్లు  విఫలం కావడంతో టైటిల్ ను అందుకోవాలనుకున్న పుణె ఆశలు తీరలేదు.

మరిన్ని వార్తలు