సాహో స్టోక్స్‌

26 Aug, 2019 05:22 IST|Sakshi
జాక్‌ లీచ్‌, స్టోక్స్‌

అజేయ సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన ఆల్‌రౌండర్‌

లీడ్స్‌: మలుపులు తిరుగుతూ సాగిన యాషెస్‌ మూడో టెస్టులో యాంటీ క్లైమాక్స్‌! నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు అసాధ్యమైన 359 పరుగుల లక్ష్య ఛేదనలో, అది కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెన్‌ స్టోక్స్‌ (219 బంతుల్లో 135 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) మహాద్భుతం చేశాడు. అజేయంగా సెంచరీ బాది జట్టుకు ఒంటి చేత్తో అనూహ్య విజయం అందించాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు గట్టి షాకిచ్చాడు.

రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 156/3తో నాలుగో రోజు ఆదివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌... స్టోక్స్‌ అమేయ పోరాటంతో మరో వికెట్‌ ఉండగానే 362 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. ఆట ప్రారంభంలోనే కీలకమైన కెప్టెన్‌ జో రూట్‌ (77) వికెట్‌ కోల్పోయి గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఇంగ్లండ్‌ను బెయిర్‌స్టో (36)తో కలిసి ఐదో వికెట్‌కు 86 పరుగులు జోడించి స్టోక్స్‌ ఆదుకున్నాడు. ఓ ఎండ్‌లో అతడు ధాటిగా ఆడుతున్నా బెయిర్‌స్టో సహా బట్లర్‌ (1), వోక్స్‌ (1), ఆర్చర్‌ (15), బ్రాడ్‌ (0) వికెట్లు పడగొట్టి ఆసీస్‌ విజయానికి దగ్గరైంది. 286 వద్ద 9వ వికెట్‌ పడిన దశలో మరో 73 పరుగులు చేయాల్సి ఉండటంతో ఆతిథ్య జట్టు కథ ముగిసినట్లే అనిపించింది.

అయితే, 11వ నంబరు బ్యాట్స్‌మన్‌ జాక్‌ లీచ్‌ (17 బంతుల్లో 1 నాటౌట్‌)ను కాపాడుకుంటూ స్టోక్స్‌ చెలరేగాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ లయన్‌ను లక్ష్యంగా చేసుకుని సిక్స్‌లు బాదాడు. అదే ఊపులో పేసర్లపైనా ప్రతాపం చూపాడు. టి20 తరహాలో స్కూప్‌ షాట్లు, రివర్స్‌ స్వీప్‌లు ఆడుతూ సెంచరీని అందుకున్నాడు. ఈ క్రమంలో క్యాచ్‌–రనౌట్‌ మిస్, స్పష్టమైన ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ తిరస్కరణ రూపంలో స్టోక్స్‌కు కొంత అదృష్టం కూడా కలిసివచ్చింది. చివరకు కమిన్స్‌ బౌలింగ్‌లో బౌండరీతో లాంఛనం పూర్తిచేశాడు. లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు అబేధ్యంగా 76 పరుగులు జోడించగా అందులో స్టోక్స్‌వే 74 పరుగులు ఉండటం విశేషం. టెస్టుల్లో చివరి వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై కుశాల్‌ పెరీరా, విశ్వ ఫెర్నాండో జోడీ దక్షిణాఫ్రికాపై 78 పరుగులు చేసింది. యాషెస్‌ నాలుగో టెస్టు వచ్చే నెల 4 నుంచి జరుగుతుంది.   

మరిన్ని వార్తలు