సూపర్‌ స్టోక్స్‌ 

18 Jul, 2020 01:00 IST|Sakshi

భారీ సెంచరీ సాధించిన ఆల్‌రౌండర్‌

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌  469/9 డిక్లేర్డ్‌

ఛేజ్‌కు 5 వికెట్లు

వెస్టిండీస్‌ 32/1 

మాంచెస్టర్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై పట్టు బిగించేందుకు ఇంగ్లండ్‌ సిద్ధమైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. మ్యాచ్‌ రెండో రోజు శుక్రవారం ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. బెన్‌ స్టోక్స్‌ (356 బంతుల్లో 176; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), డామ్‌ సిబ్లీ (372 బంతుల్లో 120; 5 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 260 పరుగులు జోడించడం విశేషం. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వెస్టిండీస్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది. క్యాంప్‌బెల్‌ (12) అవుట్‌ కాగా... బ్రాత్‌వైట్‌ (6 బ్యాటింగ్‌), అల్జారి జోసెఫ్‌ (14 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఎంత బాగా ఆడతారనేదానిపై మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.
భారీ భాగస్వామ్యం 
తొలి రోజే క్రీజ్‌లో పాతుకుపోయిన సిబ్లీ, స్టోక్స్‌ శుక్రవారం కూడా తమ జోరు కొనసాగించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 207/3తో ఆట మొదలు పెట్టిన వీరిద్దరు అంతే పట్టుదలతో నిలబడి పరుగులు రాబట్టారు. 93 ఓవర్లు ముగిసిన తర్వాత విండీస్‌ కొత్త బంతిని తీసుకున్నా లాభం లేకపోయింది. సుదీర్ఘ సమయం పాటు మైదానంలో గడిపిన సిబ్లీ ఎట్టకేలకు 312 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ 57 పరుగులు చేయగా, విండీస్‌కు ఒక్క వికెటైన దక్కలేదు. లంచ్‌ ముగిసిన వెంటనే ఛేజ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ బౌండరీతో 255 బంతుల్లో స్టోక్స్‌ శతకం మార్క్‌ను చేరుకున్నాడు. అతని కెరీర్‌లో ఇది 10వ సెంచరీ. ఎట్టకేలకు ఈ భారీ భాగస్వామ్యాన్ని ఛేజ్‌ విడదీశాడు. డీప్‌ మిడ్‌వికెట్‌లో రోచ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో సిబ్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది.
స్టోక్స్‌ దూకుడు 
సెంచరీ తర్వాత స్టోక్స్‌ మరింత ధాటిగా ఆడాడు. 46 బంతుల్లోనే అతను 100నుంచి 150 పరుగులకు చేరుకున్నాడు. టీ విరామానికి ముందే ఒలీ పోప్‌ (7) వికెట్‌ పడింది. మూడో సెషన్‌లో డబుల్‌ సెంచరీ సాధించే అవకాశం కనిపించిన స్టోక్స్‌ చివరకు దానిని అందుకోలేకపోయాడు. వరుస బంతుల్లో స్టోక్స్, వోక్స్‌ (0)లను రోచ్‌ అవుట్‌ చేయడంతో విండీస్‌కు ఊరట దక్కింది. చివర్లో బట్లర్‌ (79 బంతుల్లో 40; 4 ఫోర్లు), బెస్‌ (26 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడటంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించగలిగింది.

>
మరిన్ని వార్తలు