‘ఇది మా ప్రపంచకప్‌.. వెనక్కి తగ్గే ముచ్చటే లేదు’

26 Jun, 2019 14:11 IST|Sakshi

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌

లండన్‌ : రెండు పరాజయాలు ప్రపంచకప్‌ నుంచి తమని తప్పించలేవని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తెలిపాడు. ఇది తమ ప్రపంచకప్‌ అని ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి ఇంగ్లండ్‌ గట్టెక్కించడానికి ఒంటిరి పోరాటం చేసిన స్టోక్స్‌(115 బంతుల్లో 89; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మిచెల్‌ స్టార్క్‌ అద్భుత యార్కర్‌కు క్లీన్‌బౌల్డై నిరాశగా పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో బ్యాట్‌ను తన్ని తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఓటమి అనంతరం మాట్లాడుతూ.. ‘ ఇది మా ప్రపంచకప్‌. గత నాలుగేళ్లుగా మాకు లభించిన మద్దతు వెలకట్టలేనిది. ప్రపంచకప్‌ ఎంత కీలకమో మాకు తెలుసు. క్రికెట్‌లోనే ఇదో అద్భుత సమయం. (చదవండి : ఇంగ్లండ్‌కు ఛేజింగ్‌ చేతకాదు)

ఈ మెగాటోర్నీకి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. వెనకడుగేసే ముచ్చటే లేదు. ఇది మా ప్రపంచకప్‌. ఎలాగైనా సాధిస్తాం. గెలపు కోసం ఒంటరిగా పోరాడినా ఫలితం దక్కనప్పుడు బాధ కలుగుతోంది. మా జట్టులోని ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు చెలరేగితే మాకు తిరుగుండదు. తదుపరి మ్యాచ్‌లపై సరైన ప్రణాళికలు రచిస్తాం. గత రెండు మ్యాచ్‌ల్లో మా ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు. ఇంగ్లండ్‌లో మాకు భారత్‌పై మంచి రికార్డు ఉంది. కానీ మేం మా అవకాశం కోసం ఎదురు చూస్తాం. బలమైన జట్టును ఢీకొంటున్నప్పుడు మన సాయశక్తుల ప్రదర్శన కనబర్చాలి. మేం మా శక్తిమేరకు పోరాడుతాం.’ అని స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు.(చదవండి : ఆసీస్‌ విలాసం ఇంగ్లండ్‌ విలాపం)

మరిన్ని వార్తలు