స్టోక్స్‌ తప్పు చేయలేదు 

15 Aug, 2018 00:34 IST|Sakshi

నిర్దోషిగా ప్రకటించిన న్యాయస్థానం

మూడో టెస్టు కోసం జట్టులోకి ఎంపిక

బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ బతికిపోయాడు! వీడియో ఆధారాలు, సాక్ష్యాలు చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నా ‘బ్రిస్టల్‌ పబ్‌ ఉదంతం’లో కోర్టు మాత్రం అతను తప్పు చేయలేదని భావించింది. తాను ఆత్మరక్షణ కోసమే ఎదురుదాడి చేశానంటూ స్టోక్స్‌ చేసిన వాదనతో జ్యూరీ ఏకీభవించింది. ఫలితంగా అతడిని తాజా వివాదంలో నిర్దోషిగా ప్రకటించింది. పోలీసులు నమోదు చేసిన అఫ్రే (బహిరంగ ప్రదేశంలో ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా గొడవకు దిగడం) ఆరోపణల నుంచి స్టోక్స్‌కు విముక్తి కలిగించింది. ఈ కేసులో స్టోక్స్‌తో పాటు సహ నిందితుడిగా ఉన్న ర్యాన్‌ అలీని కూడా కోర్టు నిర్దోషిగా తేల్చగా, మూడో నిందితుడు ర్యాన్‌ హేల్‌ తప్పు చేయలేదని కోర్టు ఇంతకు ముందే ప్రకటించింది. తీర్పు అనంతరం కోర్టులో స్టోక్స్‌ భార్య క్లార్‌ కన్నీళ్లపర్యంతమవగా, స్టోక్స్‌ భావోద్వేగాలను నియంత్రించుకొని ర్యాన్‌ అలీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. 27 ఏళ్ల స్టోక్స్‌కు తాజా తీర్పు ఎంతో ఊరటనిచ్చింది. గత 11 నెలలుగా ఈ వివాదంతో అతను సమమతమయ్యాడు. భారత్‌తో తొలి టెస్టులో విజయం అందించిన అనంతరం స్టోక్స్‌ గత సోమవారం నుంచి జరిగిన కోర్టు విచారణకు హాజరయ్యాడు.
 
నేపథ్యమిదీ... 
గత ఏడాది సెప్టెంబర్‌ 24న బ్రిస్టల్‌లో ఈ వివాదాస్పద ఘటన జరిగింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో విజయం అనంతరం రాత్రి జట్టు సభ్యుడు హేల్స్‌తో కలిసి స్టోక్స్‌ పబ్‌కు వెళ్లాడు. రాత్రి 2 గంటల సమయంలో పబ్‌ బయట వారు కొందరితో గొడవ పడిన చిత్రాలు బయటకు రావడంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్‌ చేసి వెంటనే వదిలేశారు. అయితే తర్వాత సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదై విచారణ సాగింది. తాజా విచారణలో ప్రాసిక్యూషన్‌ స్టోక్స్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించింది. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి దాదాపు ఎదుటి వ్యక్తిని చంపే స్థాయిలో స్టోక్స్‌ దాడి చేశాడని ఆరోపించింది. అయితే ఇద్దరు ‘గే’ వ్యక్తులను రక్షించే ప్రయత్నంలోనే తాను జోక్యం చేసుకున్నట్లు స్టోక్స్‌ వివరణ ఇచ్చాడు. వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు కొట్టబోయిన ర్యాన్‌ హేల్, ర్యాన్‌అలీలను తాను నిరోధించానని అతను చెప్పాడు. దాంతో తనపైనే దాడికి ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణకే వారిద్దరిపై పంచ్‌లు విసిరినట్లు స్టోక్స్‌ స్పష్టం చేశాడు. తాను ఆ సమయంలో మద్యం తాగిన మాట వాస్తవమే అయినా నియంత్రణలోనే ఉన్నట్లు ఈ డర్హమ్‌ ఆల్‌రౌండర్‌ వివరించాడు. అయితే వీడియో ఫుటేజీలో స్టోక్స్‌ తీవ్రంగా దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉండటంతో అతను తప్పించుకోవడం కష్టమని అనిపించింది. అదృష్టవశాత్తూ స్టోక్స్‌ వివరణతో కోర్టు సంతృప్తి చెందింది. ‘అఫ్రే’ కేసులో చట్టం ప్రకారం ఎవరైనా బాధితుడై ఉండి అతడే లక్ష్యంగా దాడి చేస్తే తీవ్రమైన శిక్షకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముగ్గురూ కొట్లాటకు దిగడంతో స్టోక్స్‌కు అది కాస్త అనుకూలంగా మారినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.  

ఈసీబీ విచారణ... 
కోర్టు కేసు నుంచి విముక్తి పొందినా ఆట పరువుకు భంగం కలిగించినందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) స్టోక్స్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్రికెట్‌ డిసిప్లిన్‌ కమిషన్‌ సమావేశం కానుంది. అయితే బ్రిస్టల్‌ ఉదంతం జరిగిన వెంటనే హేల్స్‌ను తర్వాతి రెండు వన్డేల నుంచి తప్పించగా... ఇదే ఆరోపణలపై స్టోక్స్‌ యాషెస్‌ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పటికే కొంత శిక్ష అనుభవించారు కాబట్టి ఇక ముందు వారిపై ఎలాంటి చర్య ఉంటుందనేది చూడాలి. మరోవైపు కోర్టు తీర్పు రాగానే భారత్‌తో ఈ నెల 18 నుంచి జరిగే మూడో టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో 13వ ఆటగాడిగా స్టోక్స్‌ను కూడా సెలక్టర్లు చేర్చారు. అయితే అతనికి ఇప్పుడు తుది జట్టులో చోటు అంత సులువు కాదు. స్టోక్స్‌ స్థానంలో వచ్చిన క్రిస్‌ వోక్స్‌ లార్డ్స్‌ టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా, మరే ఆటగాడిని తప్పించే పరిస్థితి కనిపించడం లేదు.    

మరిన్ని వార్తలు