కెప్టెన్‌గా స్టోక్స్‌ ఓకే: స్టువర్ట్‌ బ్రాడ్‌

29 Jun, 2020 13:39 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ స్థానంలో ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ సరైనోడు అని అంటున్నాడు పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌.  ఇంగ్లండ్‌ సారథిగా రూట్‌ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యాలు స్టోక్స్‌కు ఉన్నాయన్నాడు. వచ్చే నెల 8వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో రూట్‌ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రూట్‌ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే సమయం కావడంతో మొదటి టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ దూరమయ్యే అవకాశం ఉంది. దాంతో అతని స్థానంలో స్టోక్స్‌ను నియమిస్తేనే బాగుంటుందని బ్రాడ్‌ అభిప్రాయపడ్డాడు. గతంలో తనతో స్టోక్స్‌ ఘర్షణ పడ్డ విషయాన్ని కూడా పక్కన పెట్టి అతనికే ఓటేశాడు బ్రాడ్‌. ‘ బెన్‌స్టోక్స్‌తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతను పెద్ద ఒత్తిడి కూడా తీసుకోడు.(‘బుమ్రా నో బాల్‌ కొంపముంచింది’)

ఒక కెప్టెన్‌గా ఇది చాలా అవసరం. విండీస్‌తో తొలి టెస్టుకు రూట్‌ అందుబాటులో లేకపోతే స్టోక్స్‌నే కెప్టెన్‌గా నియమిస్తే మంచిది. అన్ని విధాలా అర్హతలు ఉన్న వ్యక్తి  చేతికే కెప్టెన్సీ  ఇస్తే జట్టును సక్రమంగా నడిపిస్తాడు. కెప్టెన్సీ జాబ్‌ అనేది చాలా కఠినమైనది. అదనపు సమావేశాలు, ప్లానింగ్‌లు చాలానే ఉంటాయి. స్టోక్స్‌ది ఒక మంచి క్రికెట్‌ బ్రెయిన్‌. గత కొన్నేళ్లుగా ఒక పరిపక్వత చెందిన క్రికెటర్‌లా స్టోక్స్‌ మారాడు. కెప్టెన్సీ జాబ్‌ అతనికే ఈజీనే. ప్రస్తుతం ఒక గేమ్‌కే కాబట్టే స్టోక్స్‌కు ఇబ్బందే ఉండదు’ అని బ్రాడ్‌ తెలిపాడు. గతేడాది చివరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ క్రికెటర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌-బెన్‌ స్టోక్స్‌ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లలో ప్రేరణ నింపే క్రమంలో బ్రాడ్‌తో స్టోక్స్‌ వాగ్వాదానికి దిగాడు. ఆటగాళ్లలో ప్రేరణ కల్గించడం గొప్ప  విషయం కాదంటూ బ్రాడ్‌ను చిన్నబుచ్చేలా మాట్లాడటంతో అది తారాస్థాయికి చేరింది. వారి మధ్య వాడివేడి వాగ్వాదం చోటు చేసుకున్నా తర్వాత దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. (సెల్ఫ్‌ ఐసోలేషన్‌‌లో ఉంటానని చెప్పి..)

మరిన్ని వార్తలు