బెన్‌ స్టోక్స్‌కు తప్పని నిరాశ

1 Jan, 2018 16:02 IST|Sakshi

లండన్‌:ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో విచారణ ఎదుర్కొంటున్న ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆ దాడి కారణంగా యాషెస్‌ సిరీస్‌కు దూరమైన స్టోక్స్‌.. ఆస్ట్రేలియాతో త్వరలో ఆరంభమయ్యే వన్డే సిరీస్‌ నుంచి సైతం వైదొలగాల‍్సి వచ్చింది. తొలుత స్టోక్స్‌కు వన్డే జట్టులో చోటు కల్పించనప్పటికీ, అతనికి క్రోన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌(సీపీఎస్‌) నుంచి ఇంకా ఎటువంటి క్లియరెన్స్‌ లభించలేదు. దాంతో అతన్ని వన్డే జట్టు నుంచి తప్పిస్తున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) తెలిపింది.

'రేపు యూకే నుంచి బయల్దేరే వన్డే బృందంతో కలిసి స్టోక్స్‌ పయనించడం లేదు. బ్రిస్టల్‌ ఘటనకు సంబంధించి సీపీఎస్‌ నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆ నేపథ్యంలో స్టోక్స్‌ను ప్రస్తుతానికి జట్టు నుంచి తప్పిస్తున్నాం. ఒకవేళ స్టోక్స్‌పై ఎటువంటి కేసు నమోదు కాకపోతే అతన్ని 48 గంటల్లో జట్టులో తిరిగి ఎంపిక చేస్తాం. ఇప్పటికైతే స్టోక్స్‌ను వన్డే జట్టు నుంచి తప్పిస్తున్నాం. అతని స్థానంలో డేవిడ్‌ మాలన్‌కు అవకాశం కల్పిస్తున్నాం' అని ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు