13 ఏళ్ల తర్వాత... రంజీ ఫైనల్లో బెంగాల్‌

4 Mar, 2020 01:32 IST|Sakshi
బెంగాల్‌ ఆటగాళ్ల సంబరం

సెమీస్‌లో కర్ణాటకపై గెలుపు

కోల్‌కతా: 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... బెంగాల్‌ క్రికెట్‌ జట్టు దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కర్ణాటకతో మంగళవారం ముగిసిన సెమీఫైనల్లో ఆతిథ్య బెంగాల్‌ జట్టు 174 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2007 తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ తుది పోరుకు అర్హత సాధించింది. 352 పరుగుల విజయలక్ష్యంతో... ఓవర్‌నైట్‌ స్కోరు 98/3తో నాలుగో రోజు ఛేదన కొనసాగించిన కర్ణాటక 55.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్‌ బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ (6/61) కర్ణాటక బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. చివరి రోజు కర్ణాటక కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు ముకేశ్‌ దక్కించుకోవడం విశేషం. రాజ్‌కోట్‌ వేదికగా సౌరాష్ట్రతో జరుగుతోన్న మరో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌కు 327 పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 66/5తో ఆటను కొనసాగించిన సౌరాష్ట్రను అర్పిత్‌ (139; 16 ఫోర్లు, సిక్స్‌) సెంచరీతో ఆదుకోవడంతో... తమ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. ఆట ముగిసే సమయానికి గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 7 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు