ఓటమితో ముగిసిన టైటాన్స్‌ పోరు

26 Dec, 2018 00:41 IST|Sakshi

జోన్‌ ‘బి’లో ఐదో స్థానంతో సరి

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌ను తెలుగు టైటాన్స్‌ పరాజయంతో ముగించింది. మంగళవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో టైటాన్స్‌ 34–39తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. ఇప్పటికే ‘ప్లే ఆఫ్‌’ అవకాశాలను చేజార్చుకున్న టైటాన్స్‌ చివరి మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. జోన్‌ ‘బి’లో 22 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌ 8 విజయాలు, 13 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 51 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. సీజన్‌ తొలి సగంలో జోరు కనబరిచిన టైటాన్స్‌ చివరి 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే నెగ్గి చేజేతులా ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలను దూరం చేసుకుంది.  మంగళవారం మ్యాచ్‌లో స్టార్‌ రైడర్లు రాహుల్‌ చౌదరి, నిలేశ్‌ బరిలో దిగలేదు.

అర్మాన్‌ 13 పాయింట్లతో పోరాడాడు. వారియర్స్‌ తరఫున మణిందర్‌ సింగ్‌ 12, సుర్జీత్‌ సింగ్‌ 7 పాయింట్లు సాధించారు. తమిళ్‌ తలైవాస్, హరియాణా స్టీలర్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 40–40తో ‘డ్రా’గా ముగిసింది. జోన్‌ ‘ఎ’లో హరియాణా చివరి స్థానంలో నిలవగా... జోన్‌ ‘బి’లో తమిళ్‌ తలైవాస్‌ చివరి స్థానంతో సీజన్‌ ముగించింది. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్, బెంగాల్‌ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్‌ తలపడనున్నాయి.
 
ఇప్పటికే జోన్‌ ‘ఎ’ నుంచి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్, యు ముంబా, దబంగ్‌ ఢిల్లీ... జోన్‌ ‘బి’ నుంచి బెంగళూరు బుల్స్, బెంగాల్‌ వారియర్స్‌ ‘ప్లే ఆఫ్‌’ దశకు అర్హత సాధించాయి. చివరిదైన ఆరో బెర్త్‌ కోసం పట్నా పైరేట్స్‌ (55 పాయింట్లు), యూపీ యోధ (52 పాయింట్లు) జట్లు రేసులో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు