కొన్ని సార్లు అంతే.. గెలవలేరు!

12 Jul, 2019 20:07 IST|Sakshi

హైదరాబాద్ ‌: ప్రపంచకప్‌ నుంచి టీమిండియా నిష్క్రమణపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు కోహ్లి సేనపై దుమ్మెత్తిపోస్తుండగా.. మరికొందరు బాసటగా నిలుస్తున్నారు. అయితే తాజాగా భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం బైచుంగ్‌ భూటియా కోహ్లి సేనకు మద్దతుగా నిలిచాడు. ‘కొన్ని సార్లు అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యుత్తమ జట్లు విజయం సాధించలేవు. 45 నిమిషాల ఆటే ఓటమికి కారణమని కోహ్లి అన్నాడు. ఓడిపోతే ఓడిపోయినట్టే దానికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఆటలో గెలపోటములు చాలా సహజం. కానీ అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి టీమిండియా అంత చెత్తగా ఏమి ఆడలేదు.

మైదానాల్లో కేవలం వారే కనిపిస్తున్నారు..
క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరించేలా ఐసీసీ చర్యలు చేపట్టాలి. కేవలం పదిజట్లతోనే ప్రపంచకప్‌ నిర్వహించడం బావ్యం కాదు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు చూసింది భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ దేశాలకు చెందిన వారే. మ్యాచ్‌ చూసే, ఆడే దేశాల సంఖ్య పెరగాలి. దీనిపై ఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టాలి’అంటూ భూటియా వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కోహ్లి సేన ఫైనల్‌ చేరకుండానే ప్రపంచకప్‌ ప్రయాణం ముగించింది. 

మరిన్ని వార్తలు