భవిష్యత్‌లో ఆలోచిస్తా! 

12 Apr, 2020 04:23 IST|Sakshi

ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై బైచుంగ్‌ భూటియా

న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అధ్యక్ష పదవి గురించి భవిష్యత్‌లో కచ్చితంగా ఆలోచిస్తానని భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా అన్నాడు. ఫేస్‌బుక్‌ చిట్‌చాట్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భూటియా తన ఆకాంక్షను బయటపెట్టాడు. 2011లో కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ సిక్కిం ఆటగాడు ప్రస్తుతం తన దృష్టంతా క్షేత్రస్థాయిలో ఫుట్‌బాల్‌ అభివృద్ధిపైనే ఉందని పేర్కొన్నాడు. ‘ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్ష పదవికి భవిష్యత్‌లో ఏదో ఒక రోజు పోటీదారుగా ఉంటా. కానీ ప్రస్తుతానికైతే క్షేత్రస్థాయి నుంచి ఫుట్‌బాల్‌ క్రీడ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.

బైచుంగ్‌ భూటియా ఫుట్‌బాల్‌ స్కూల్, యునైటెడ్‌ సిక్కిం క్లబ్‌ల ద్వారా నేను అదే పనిలో ఉన్నా’ అని 43 ఏళ్ల భూటియా అన్నాడు. ఫుట్‌బాల్‌లో అపార నైపుణ్యం ఉన్న భూటియా భారత్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్‌ బ్రాండన్‌ ఫెర్నాండోస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ‘ఈ కాలం స్ట్రయికర్‌లలో సునీల్‌ ఛెత్రి, మిడ్‌ ఫీల్డర్‌లలో బ్రాండన్‌ ఫెర్నాండోస్‌ ఉత్తమ ప్లేయర్లు. ఐఎస్‌ఎల్‌లో ఎఫ్‌సీ గోవా తరఫున బ్రాండన్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. మైదానంలో అతని నైపుణ్యాలు గొప్పగా ఉంటాయి’ అని భూటియా తెలిపాడు. 1995 నుంచి 2011 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన భూటియా జూనియర్, సీనియర్‌ స్థాయిలలో కలిపి మొత్తం 104 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 40 గోల్స్‌ సాధించాడు.

మరిన్ని వార్తలు