సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

22 Jul, 2019 14:07 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ‘బౌండరీలు’ ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.  దీనిపై దిగ్గజ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పించారు. దీనిలో భాగంగా ఈ రూల్‌ను పునః పరిశీలించాల్సిన అవసరముందంటూ సూచనలు కూడా చేశారు. మెగా ఫైట్‌లో విజేతను తేల్చేక్రమంలో సూపర్‌ ఓవర్‌ సైతం టైగా ముగిస్తే, మరొక సూపర్‌ ఓవర్‌ను వేయిస్తే బాగుంటుందని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  దీనికి తాజాగా భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ మద్దతు ప్రకటించాడు.

వరల్డ్‌కప్‌ వంటి మెగా ఈవెంట్‌లో బౌండరీల లెక్కన విజేతను నిర్ణయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. సచిన్‌ సూచించిన మరొక సూపర్‌ ఓవర్‌ సూచనతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపాడు. ‘ అసలు అత్యధిక బౌండరీల గెలిచిన జట్టు విజేత అనే నిబంధనను ఎందుకు ప్రవేశపెట్టారో తెలియదు. విజేతను నిర్ణయించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ బౌండరీల ఆధారంగా జట్టును గెలిచినట్లు ప్రకటించేకంటే,  వికెట్ల ఆధారంగా విజేతను నిర్ణయించడం సమంజసంగా ఉంటుందనేది నా అభిప్రాయం. అదే సమయంలో మరొక సూపర్‌ ఓవర్‌తో విజేతను తేల‍్చినా ఫర్వాలేదు’ అని భరత్‌ అరుణ్‌ తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌లో ‘టాప్‌’లో నిలిచిన జట్టుకు మరొక అవకాశం ఉంటే బాగుంటుందన్నాడు. ఇందుకు ఐపీఎల్‌ తరహా నిబంధనను తీసుకురావాలని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు