భువీ, బుమ్రా వచ్చేశారు

26 Oct, 2018 04:58 IST|Sakshi
భువనేశ్వర్‌ కుమార్, జస్‌ప్రీత్‌ బుమ్రా

చోటు కోల్పోయిన పేసర్‌ షమీ

విండీస్‌తో మిగతా మూడు వన్డేలకు జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: టీమిండియా పేస్‌ బౌలింగ్‌ ప్రధాన అస్త్రాలైన భువనేశ్వర్‌ కుమార్, జస్‌ప్రీత్‌ బుమ్రా వెస్టిండీస్‌తో జరుగనున్న మిగతా మూడు వన్డేలకు జట్టులోకి వచ్చారు. సెలక్షన్‌ కమిటీ గురువారం జట్టును ప్రకటించింది. ఇందులో ఉమేశ్‌ యాదవ్‌ చోటు కాపాడుకోగా... మొహమ్మద్‌ షమీని తప్పించారు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టును యథాతథం గా కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్నా కేదార్‌ జాదవ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. మొదటి రెండు వన్డేలకు భువీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.  

జాదవ్‌కు చోటు లేదు!
ప్రస్తుత సిరీస్‌లో అనుకూల పిచ్‌లపై బ్యాట్స్‌మెన్‌ చెలరేగుతుండటంతో ఇరు జట్ల బౌలర్లు చేసేదేమీ లేకపోతోంది. ముఖ్యంగా హిట్టింగ్‌కు పేరుగాంచిన విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను మన పేసర్లు, స్పిన్నర్లు అనుకున్నంతగా కట్టడి చేయలేకపోతున్నారు. రెండు వన్డేల్లో కలిపి ఉమేశ్‌ 142, షమీ 140 పరుగులిచ్చారు. అయితే, తొలి మ్యాచ్‌లో విఫలమైన షమీ... విశాఖపట్నంలో మెరుగ్గా (1/59) బౌలింగ్‌ చేశాడు. చివరి ఓవర్లలో యార్కర్లతో పరుగులు నిరోధించాడు. ఈ విషయంలో ఉమేశ్‌ కంటే మెరుగైన షమీని తప్పించడం ఆశ్చర్యకరంగా ఉంది. మరోవైపు బౌలింగ్‌ ఇలాగే ఉంటే వన్డే సిరీస్‌ నెగ్గడం కష్టమని భావించారో, ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టు కుని పూర్తి స్థాయి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అవసరం అనుకున్నారో కాని భువీ, బుమ్రాల విశ్రాంతిని ముగించారు. ఇక, ఫిట్‌నెస్‌ సంతరించుకుని గురువారం దేవధర్‌ ట్రోఫీలో భారత్‌ ‘ఎ’ తరఫున బ్యాట్‌తో రాణించి, ఐదు ఓవర్లు కూడా వేసిన జాదవ్‌ను తీసుకోకపోవడమూ కొంత చర్చకు తావిచ్చింది.

నన్నెందుకు తీసుకోలేదో?: జాదవ్‌
విండీస్‌తో తదుపరి మూడు వన్డేలకు ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్‌ కమిటీ నుంచి తనకెలాంటి సమాచారం లేదని ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ పేర్కొన్నాడు. ఢిల్లీలో దేవధర్‌ ట్రోఫీ ఆడుతోన్న అతడిని... టీమిండియాలోకి తీసుకోకపోవడం గురించి మీడియా అడగ్గా ‘ఈ విషయం మీ ద్వారా ఇప్పుడే తెలిసింది. నన్నెందుకు ఎంపిక చేయలేదో ఆలోచించాల్సి ఉంది. జట్టుతో లేను కాబట్టి వారి ప్రణాళికలేమిటో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించాడు. తాను పూర్తిగా కోలుకుని మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు తెలిపాడు. గాయాల నుంచి కోలుకున్నట్లు ఎన్‌సీఏ ప్రకటిస్తేనే ఏ టోర్నీ అయినా ఆడిస్తారని అన్నాడు. గురువారం భారత్‌ ‘ఎ’ తరఫున ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌ ఆడిన జాదవ్‌... 25 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ను ముగ్గురు జాతీయ సెలక్టర్లు వీక్షించడం గమనార్హం.

కేదార్‌ జాదవ్‌

గాయాల చరిత్రే కారణం: ఎమ్మెస్కే
కేదార్‌ జాదవ్‌ను టీమిండియాలోకి తీసుకోకపోవడానికి అతడి గాయాల చరిత్రే కారణమని సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. ‘గతంలో కోలుకొని జట్టులోకి వచ్చిన వెంటనే జాదవ్‌ గాయాలకు గురయ్యాడు. ఇటీవల ఆసియా కప్‌లో కూడా అదే జరిగింది. దీంతో పాటు దేవధర్‌ ట్రోఫీలో భారత్‌ ‘ఎ’ గురువారం నెగ్గి ఉంటే... అతడికి ఫైనల్‌ రూపంలో మరో మ్యాచ్‌ ఆడే అవకాశం ఉండేది. అప్పుడు తన ఫిట్‌నెస్‌పై మేం పూర్తి భరోసాకు వచ్చేవాళ్లం. నాలుగో వన్డేకు భారత జట్టులోకి అదనపు ఆటగాడిగా తీసుకునేవాళ్లమేమో. జట్టు ఎంపిక సందర్భంగా మేం ఓ పద్ధతి అనుసరిస్తున్న తీరును ఆటగాళ్లు అర్థం చేసుకోవాలి’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు