బిగ్‌–3 ఫార్ములా కొనసాగించాలి

19 Apr, 2017 01:33 IST|Sakshi

బీసీసీఐ ఎస్‌జీఎంలో ఏకగ్రీవ నిర్ణయం  

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)లో ప్రస్తుతమున్న ఆదాయ విభజన ఫార్ములా ‘బిగ్‌–3’ని కొనసాగించాల్సిందేనని బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర క్రికెట్‌ సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని అమోదించాయి. ఐసీసీకి వచ్చే ఆదాయంలో సింహభాగం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ బోర్డులకు దక్కేలా ఫార్ములా అమలవుతున్న సంగతి తెలిసిందే. జూన్‌లో లండన్‌లో జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం వరకు ఈ బిగ్‌–3 ఫార్ములాను కొనసాగించాలని బీసీసీఐ తేల్చిచెప్పింది.

ఈ ఫార్ములాకు విరుద్ధంగా ఐసీసీ నిర్ణయం తీసుకుంటే చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి భారత్‌ వైదొలగాలనే డిమాండ్‌ను మాత్రం రాష్ట్ర సంఘాలు వ్యతిరేకించాయి. అలాంటి నిర్ణయం తగదని సూచించాయి. ఈ నెల 27, 28 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో బీసీసీఐ వైఖరిని చెప్పేందుకు అమితాబ్‌ చౌదరి భారత బోర్డు ప్రతినిధిగా హాజరు కానున్నారు. భారత ప్రయోజనాలు కాపాడటమే తమ ముఖ్య ఉద్దేశమని చౌదరి ఈ సందర్భంగా చెప్పారు.

నజరానా రెట్టింపు: ఆస్ట్రేలియాపై 2–1తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లకు ఇచ్చే  నజరానాను రెట్టింపు చేశారు. ఒక్కొక్కరికి రూ. కోటి ఇవ్వాలని బీసీసీఐ సమావేశంలో నిర్ణయించారు. ఇంతకుముందు రూ. 50 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇస్తామని  బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు