ఇక టాప్‌-5 జట్లకు అవకాశం!

26 Jul, 2019 10:37 IST|Sakshi

సిడ్నీ: వరల్డ్‌కప్‌ లీగ్‌దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్లకు ఏం ప్రయోజనం చేకూరుతుందనే వాదన వినిపించిన సంగతి తెలిసిందే. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో కూడా ఐపీఎల్‌ తరహా ప్లేఆఫ్స్‌ను అమలు చేయాలని డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీని వల్ల తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు మేలు జరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే తాజాగా బిగ్‌బాష్ లీగ్‌ తీసుకున్న సరికొత్త నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు మరింత ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ప్లేఆఫ్స్‌ను తీర్చిదిద్దింది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌ బాష్‌ లీగ్ క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమే. ఈ పొట్టి లీగ్‌కు ఐపీఎల్‌ మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. డిసెంబర్‌ 17 నుంచి మొదలయ్యే బిగ్‌బాష్‌ తొమ్మిదో సీజన్‌లో కొత్త తరహా ఫైనల్స్‌ను నిర్వహించనున్నారు.

పట్టికలో నిలిచిన తొలి ఐదు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్లకు ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ‘ఎలిమినేటర్‌’లో గెలిచిన జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో ‘ది నాకౌట్‌’లో పోటీపడుతుంది. మరోవైపు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ‘క్వాలిఫయిర్’లో తలపడతాయి. దీనిలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు మాత్రం ‘నాకౌట్‌’లో విజయం సాధించిన టీమ్‌తో ‘ది చాలెంజర్‌’లో తలపడుతుంది. చాలెంజర్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు