ఏబీ.. నీకిది తగునా?

23 May, 2018 19:48 IST|Sakshi
ఏబీ డివిలియర్స్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : దక్షిణాఫ్రికా విధ్యంసకర బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అనూహ్య నిర్ణయానికి యావత్‌ క్రికెట్‌ లోకం షాక్‌కు గురైంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)తో భారత అభిమానులకు మరింత చేరువైన మిస్టర్‌ 360.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని వారు జీర్ణీంచుకోలేకపోతున్నారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున మొన్నటి వరకు అలరించిన ఏబీ.. ఇక మైదానంలో కనిపించడా? అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏబీ నీకిది తగునా అని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ‘దక్షిణాఫ్రికా ఈసారైనా ప్రపంచకప్‌ గెలుస్తుందని ఆశ ఉండేది.. కానీ నీ నిర్ణయంతో మా ఆశలు ఆవిరయ్యాయని ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. 

వైవిధ్యానికి మారు పేరు..
మైదానంలో వైవిధ్యమైన షాట్‌లతో ఏబీ అభిమానుల మనసులను దోచుకున్నాడు. క్రీజులో అటు..ఇటు తిరుగుతూ చెలరేగే మిస్టర్‌ 360..  ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నం. ఎంతలా అంటే ‘మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో ఏబీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్‌ అనేంతా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. ఐపీఎల్‌ అంటే శివమెత్తే డివిలియర్స్‌ ప్రతి సీజన్‌లో తనదైన బ్యాటింగ్‌తో అలరించాడు. దక్షిణాఫ్రికా జట్టుకు ప్రపంచకప్‌ను అందించకుండానే క్రికెట్‌ గుడ్‌బై చెప్పాడు.

వన్డే క్రికెట్‌లో వేగవంతమైన 50, 100, 150 పరుగులు సాధించిన ఆటగాడిగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అంతేకాదు టెస్టు క్రికెట్‌లోనూ దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన శతకం, టీ20ల్లో అర్ధశతకం సాధించాడు. 123 టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్ 22 సెంచరీల సాయంతో 8,765 పరుగులు చేయగా‌, 228 వన్డేలాడిన ఏబీ 25 శతకాల సాయంతో 8,577 పరుగులు సాధించాడు. 78 అంతర్జాతీయ టీ20లు ఆడి 1,672 పరుగులు చేశాడు. 

ఆశ్చర్యపోయిన మాజీ క్రికెటర్లు
డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రికెట్‌ ప్రపంచానికి ఓ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ దూరమయ్యాడని, మైదానంలో రాణించినట్లు మిగతా జీవితంలో కూడా విజయవంతం కావాలని కోరుకున్నారు. ట్విటర్‌ వేదికగా డివిలియర్స్‌కు అభినందనలు తెలిపారు.

‘ప్రపంచలో అత్యంతగా ఇష్టపడే క్రికెటర్‌ డివిలియర్స్‌కు అభినందనలు.. నీ దూరంతో అంతర్జాతీయ క్రికెట్‌ వెలవెలబోనుంది. కానీ నీవు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను రజింపచేస్తావని అనుకుంటున్నా’ అని టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. ‘డివిలియర్స్‌.. నీవు మైదానంలో ఉండాటాన్నే ఇష్టపడుతా. నీ 360 డిగ్రీల ఆటను మేం కోల్పోతున్నాం. జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

 చదవండి: డివిలియర్స్‌ సంచలన నిర్ణయం! 

మరిన్ని వార్తలు