ఆ ఏడాది నుంచే నాలో మార్పు: కోహ్లి

18 May, 2020 11:19 IST|Sakshi

నాలో పరివర్తనకు అతనే కారణం

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టును ఫిట్‌నెస్‌ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత శంకర్‌ బసూదే. కోహ్లి, బుమ్రా వంటి క్రికెటర్లను  ఫిట్‌నెస్‌ పరంగా కూడా టాప్‌లో నిలిపిన వ్యక్తి శంకర్‌ బసూ. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు సెమీస్‌లో తన పోరాటాన్ని ముగించిన తర్వాత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శంకర్‌ బసూ తప్పుకున్నాడు. తన కాంట్రాక్ట్‌ గడువు ముగిసిపోవడంతో శంకర్‌ బసూ మళ్లీ అందుకు మొగ్గుచూపలేదు. అయితే తన కెరీర్‌లో ఫిట్‌నెస్‌ పరంగా అతిపెద్ద మార్పు రావడానికి శంకర్‌ బసూనే కారణమంటున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఫిట్‌నెస్‌, ట్రైనింగ్‌ పరంగా తనలో పరివర్తన రావడానికి బసూనే ప్రధాన కారణమన్నాడు.

2015 నుంచి ఫిట్‌నెస్‌ పరంగా శ్రద్ధ తీసుకోవడం ఆరంభించానని, అప్పట్నుంచే తన కెరీర్‌ గ్రాఫ్‌ క్రమేపీ పెరుగుతూ వచ్చిందన్నాడు. ‘నా ప్రస్తుత ఫిట్‌నెస్‌ క్రెడిట్‌ను నేను తీసుకోను. అది శంకర్‌ బసూదే. నా కెరీర్‌లో ఫిట్‌నెస్‌ పరంగా వచ్చిన అతి పెద్ద మార్పు 2015 నుంచి ప్రారంభమైంది. నా కెరీర్‌ మరో స్థాయికి వెళ్లడంలో శంకర్‌ బసూ పాత్ర మరువలేనిది’ అని భారత ఫుట్‌బాల్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రీతో జరిగిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సంభాషణలో కోహ్లి వెల్లడించాడు.  2015 నుంచి 2019 వరకూ భారత క్రికెట్‌ జట్టు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా శంకర్‌ బసూ కొనసాగాడు. ఈ క్రమంలోనే భారత  జట్టులో అనేక మార్పులు తీసుకొచ్చారు. (ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?)

‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఆర్సీబీ ట్రైనర్‌గా బసూ కొనసాగిన సమయంలో లిఫ్టింగ్‌ను తీసుకొచ్చారు బసూ. దానికి నేను కొంత సంశయించాను. నాకు కొన్ని నడుంనొప్పి సమస్యలు కూడా వచ్చాయి. అది నాకు చాలా కొత్త కాన్సెప్ట్‌ అనిపించింది. కానీ దాన్ని ప్రారంభించిన మూడు వారాల తర్వాత అమోఘమైన  ఫలితాలు  రావడం చూశాను. ఆ తర్వాత నా డైట్‌లోనూ  ఆయన సమూల మార్పులు తీసుకొచ్చారు. నా శరీరంలో జరిగే మార్పులు గమనించాను. నా శారీరక పరిస్థితిని బట్టి రోజుకి రెండు-మూడు సార్లు ఆయన చెప్పే దానిని పాటిస్తూ వచ్చాను. నా కెరీర్‌కు ఏది కావాలో అవే సూచనలు చేశారు బసూ.  అంతకుముందు వరకూ నేను గేమ్‌ను మాత్రమే ఆడుతూ ఉండేవాడిని. నువ్వు దేశం తరఫున ఆడాలంటే మరింత శ్రమించక తప్పదనే విషయాన్ని తెలుసుకున్నాను. ఒకవేళ మనం శ్రమించడంలో వెనుకంజ వేస్తే మాత్రం అనుకున్నది సాధించడానికి చాలా దూరంలో ఆగిపోతాం’ అని కోహ్లి తెలిపాడు. ('సచిన్‌ డబుల్‌ సెంచరీకి అంపైర్‌ కారణం')

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు