‘దేశంలో ఐపీఎల్‌ని మించిన స్కాం లేదు’

19 Nov, 2018 13:28 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కాదు.. క్యాష్‌ రిచ్‌ టీ20.. ఐపీఎల్‌ని మించిన స్కాం దేశంలో మరోకటి లేదంటూ విమర్శల వర్షం గుప్పించారు భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడి. న్యూ ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన ‘సాహిత్య ఆజ్‌ తక్‌’ కార్యక్రమానికి హాజరైన బిషన్‌ సింగ్‌ ఐపీఎల్‌ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఐపీఎల్‌ని మించిన స్కాం మరొకటి లేదు. ఐపీఎల్‌ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎక్కడికెళ్తుందో ఎవరికి తెలియదన్నారు.

ఐపీఎల్‌ రెండో సీజన్‌ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రి అనుమతి లేకుండనే లక్షల కొద్ది సొమ్ము దేశం దాటి వెళ్లి పోయిందన్నారు. అంతేకాక ఐపీఎల్‌ కోసం ఎన్నుకునే ఆటగాళ్లను ఇండియన్‌ సెలక్షన్‌ ఆధారంగానో, స్థానింకగా జరిగే టీ20ల ఆధారంగానో సెలక్ట్‌ చేయడం లేదన్నారు. ఒక జట్టులో అధిక మొత్తంలో డిమాండ్‌ చేసే ఆటగాడితో పాటు.. తక్కువ డబ్బు తీసుకునే ఆటగాడు కూడా ఉంటాడు. తక్కువ ఆదాయం ఉన్న ఆటగాడికి సరైన నైపుణ్యాలు ఉండవు. కానీ అతడు నిలదొక్కుకోవాలి.. అందుకే అలాంటి వారు బెట్టింగ్‌ వైపు దృష్టి సారిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా బిషన్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏకపక్ష నిర్ణయాల గురించి కూడా విమర్శించారు. అనిల్‌ కుంబ్లే కోచ్‌ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలు అందరికి తెలుసంటూ వ్యాఖ్యానించారు. జట్టులోని ఒక వ్యక్తి(కోహ్లి) తను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. మనం వీటన్నింటిని చూస్తూ ఉంటాం అన్నారు. అంతేకాక బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా కోహ్లి మీద విపరీతమైన ప్రెజర్‌ పెడుతున్నాం.. ఇది మంచిది కాదన్నారు.

నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా - ఇండియాటెస్ట్ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది.

మరిన్ని వార్తలు