‘అతన్ని కెప్టెన్‌గా తొలగించండి’

5 Jan, 2020 15:55 IST|Sakshi

అది రౌడీ ప్రవర్తన

న్యూఢిల్లీ:మొహాలీ వేదికగా శుక్రవారం ఢిల్లీతో జరిగిన పంజాబ్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఔట్‌ కాకపోయినా అంపైర్‌ పాశ్చిమ్‌ పఠాక్‌ ఔట్‌ ఇవ్వడంతో  కాసేపు క్రీజ్‌లో అలానే ఉండిపోయాడు. క్రీజ్‌ను వదిలి వెళ్లనంటూ మొండికేసిన గిల్‌.. అంపైర్‌ను తిట్టిపోశాడు.  అసలు అంపైరింగ్‌ తెలుసా అంటా దుమ్మెత్తిపోశాడు. అయితే శుభ్‌మన్‌ గిల్‌ ప్రవర్తనపై ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడకపోయినా భారత దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ తీవ్రంగా మండిపడ్డాడు.  క్రికెటర్‌ననే విషయం మరిచిపోయి రౌడీలా ప్రవర్తిస్తావా అంటూ విమర్శించాడు.(ఇక్కడ చదవండి: క్రీజ్‌ను వదిలి వెళ్లను.. అంపైర్‌పై తిట్ల దండకం!)

‘ఈ తరహా ప్రవర్తన గిల్‌కు సరైనది కాదు. ఇది గిల్‌కే ఏ ఒక్క క్రికెటర్‌కూ మంచి పద్ధతి కాదు. భారత-ఏ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న గిల్‌ ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. నీకు ఎంత టాలెంట్‌ ఉన్నా ఏ ఒక్కరూ గేమ్‌ అంటే ఎక్కువ కాదు.  క్రికెటర్‌వనే సంగతి మరిచి రౌడీలా ప‍్రవర్తిస్తావా. భారత-ఏ జట్టుకు ఒక పరిపక్వత ఉన్న క్రికెటర్‌ కెప్టెన్‌గా ఉండాలి. భారత-ఏ జట్టు కెప్టెన్‌గా గిల్‌ను తొలగించాలి. మ్యాచ్‌ రిఫరీ మాట్లాడకముందే గిల్‌ను భారత-ఏ జట్టు కెప్టెన్‌ పదవి నుంచి తప్పించండి’ అని బిషన్‌ సింగ్‌ బేడీ విమర్శించాడు. న్యూజిలాండ్‌-ఏ జట్టుతో సిరీస్‌కు ఇటీవల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు