‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ 

29 Jun, 2020 23:59 IST|Sakshi

లోగో ముద్రించిన జెర్సీలతో వెస్టిండీస్‌ క్రికెటర్లు బరిలోకి

ఐసీసీ  అనుమతి

జూలై 8 నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు

లండన్‌: అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యానంతరం ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. ఇప్పుడు క్రికెట్‌ మైదానంలో దానికి సంఘీభావం తెలిపేందుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. జూలై 8 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో విండీస్‌ క్రికెటర్లు తమ జెర్సీ కాలర్‌పై ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విండీస్‌ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆగిపోయింది. ఇప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ‘బయో సెక్యూర్‌ బబుల్‌’ వాతావరణంలో వెస్టిండీస్‌కు సొంతగడ్డపై ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లండ్‌ బోర్డు సిద్ధమైంది. విరామం తర్వాత జరగనున్న తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఇదే కానుంది.

‘జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం గురించి ప్రచారం చేసే, దానికి సంఘీభావం తెలిపే బాధ్యత మాకుందని భావిస్తున్నాం. క్రికెట్‌ చరిత్రలో ఇదో చారిత్రాత్మక ఘట్టం. మేం క్రికెట్‌ ఆడటానికే ఇంగ్లండ్‌కు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో మాకు బాగా తెలుసు. శరీరం రంగు కారణంగా ఒకరిపై అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం ఎంత బాధగా ఉంటుందో వెస్టిండీస్‌ క్రికెటర్లకు బాగా తెలుసు. వర్ణం కారణంగా అసమానతలు ఉండరాదనేది మా కోరిక. సమాన హక్కులు సాధించడం కోసం అందరూ ప్రయత్నించాలి’ అని వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ వ్యాఖ్యానించాడు.  విండీస్‌ ఆటగాళ్లు ధరించబోయే లోగోను అలీషా హోసానా డిజైన్‌ చేయగా... ఇటీవల మళ్లీ ప్రారంభమైన ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో 20 జట్ల ఆటగాళ్లు కూడా ధరించారు. సరిగ్గా ఆ లోగోకే ఐసీసీ అనుమతి ఇచ్చింది.

ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు... 
‘ఐసీసీ క్లాతింగ్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ నిబంధనల ప్రకారం రాజకీయ, మతపరమైన, జాతి వివక్షకు సంబంధించిన సందేశాలు ఎలాంటివి కూడా ప్రదర్శించేందుకు అనుమతి లేదు’... ఇలా  ఐసీసీ తమ నిబంధనల్లో స్పష్టంగా చెప్పింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్‌ ధోని తన వికెట్‌ కీపింగ్‌ గ్లవ్స్‌పై డాగర్‌ గుర్తు ముద్రించి ఉన్న ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ను ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని తర్వాతి మ్యాచ్‌ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంది. ఇంకాస్త వెనక్కి వెళితే భారత్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ‘ఫ్రీ పాలస్తీన్, సేవ్‌ గాజా’ అంటూ రిస్ట్‌ బ్యాండ్‌ ధరించగా రిఫరీ డేవిడ్‌ బూన్‌ తీసేయించారు. ఇంగ్లండ్‌ బోర్డు దానిని రాజకీయపరమైంది కాదు మానవత్వానికి సంబంధించి అని మొయిన్‌ అలీని సమర్థించినా ఐసీసీ అంగీకరించలేదు.

ఇప్పుడు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ వీటికి ఎలా భిన్నమో ఐసీసీనే చెప్పాలి. ఎలా చూసుకున్నా తాజా అమెరికా అంశానికి కూడా ఆటలతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా బయట ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా... మైదానంలోకి వచ్చేసరికి ఏ క్రీడలోనైనా అంతా ఒక్కటే అంటూ బరిలోకి దిగడం ప్రాథమిక స్ఫూర్తి. ఇటీవలి పరిణామాలపై ఐసీసీ స్పందిస్తూ ‘నిబంధనల ప్రకారం అన్నింటిని ఒకే గాటన కట్టకుండా తమ విచక్షణ మేరకు ఆయా సందర్భానుసారం నిబంధనల విషయంలో కాస్త సడలింపు ఇస్తాం’ అని ప్రకటించింది. మొత్తంగా చూస్తే జాతి వివక్షను వ్యతిరేకించే విషయంలో తామెక్కడ వెనకబడిపోతామో అనుకొని దీనికి అనుమతి ఇచ్చినట్లు అర్థమవుతోంది. అన్నట్లు జట్టు మొత్తం నల్లవారితోనే నిండిన వెస్టిండీస్‌ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అంటూ సంఘీభావం తెలపడం కంటే శ్వేత జాతీయులతో నిండిన ఇంగ్లండ్‌ టీమ్‌ అలా చేసి ఉంటే భిన్నంగా ఉండేదేమో.

మరిన్ని వార్తలు