సంకల్పానికి సాయం కావాలి

17 Feb, 2016 23:59 IST|Sakshi
సంకల్పానికి సాయం కావాలి

పోరాడుతున్న బ్లేడ్ రన్నర్  
స్పాన్సర్‌షిప్ కోసం ఎదురుచూపు
రియో ఒలింపిక్స్ అర్హతే లక్ష్యం

 
 సంకల్పం బలంగా ఉంటే... వైకల్యం చిన్నబోతుంది...
 పోరాడే తపన ఉంటే... విజయం మన వెంటే పరుగు తీస్తుంది...
 కానీ ఆర్థిక స్తోమత లేకపోతే... తపన, సంకల్పం కూడా మూగబోతాయి.


దేశంలోనే మొదటి బ్లేడ్న్న్రర్‌గా గుర్తింపు పొందిన చల్లా పవన్ కుమార్‌ది కూడా ఇదే సమస్య. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... పారాలింపిక్స్ లక్ష్యంగా.... రియో వైపు పరుగు తీస్తుంటే... ఆర్థిక ఇబ్బందులు వెనక్కు లాగుతున్నాయి. నైపుణ్యం, స్ఫూర్తి ఉన్న ఓ క్రీడాకారుడు సరైన ప్రోత్సాహం లేక సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నాడు.
 
 సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొదటి బ్లేడ్ రన్నర్‌గా చల్లా పవన్‌కుమార్‌కు గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో పలు పారా ఈవెంట్లలో పాల్గొన్న అతని పేరు దేశంలోని మారథాన్ పోటీల్లో అందరికీ చిరపరిచితం. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వరకు ఎక్కడైనా అతను సాధారణ రన్నర్లతో పోటీ పడుతూ ఉంటాడు. 2013లో బీజింగ్ గ్రాండ్‌ప్రిలో తొలిసారి పారా విభాగంలో పోటీ పడిన పవన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడలకు అవకాశం వచ్చినా... వేర్వేరు కారణాలతో చివరి నిమిషంలో అది చేజారింది. ఆ తర్వాత ఒలింపిక్సే లక్ష్యంగా మార్చుకున్న అతను దాని కోసం ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

 నాటి విషాదం
 2005లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే ఒక రోడ్డు ప్రమాదంలో పవన్ కుడి కాలు కోల్పోయాడు. మున్ముందు ఇబ్బంది రాకుండా మోకాలి కింది భాగం వరకు తొలగించాల్సి వచ్చింది. దాంతో తన పైలట్ లక్ష్యం కళ్ల ముందే మాయమైంది. తండ్రి పని చేస్తున్న చోటే వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటూ అతను దానిపైనే దృష్టి పెట్టాడు. అయితే సాధారణంగా రోజూవారీ నడక కోసం కృత్రిమ కాలును అమర్చుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంలో ఒక డాక్టర్ ప్రఖ్యాత పిస్టోరియస్ గురించి చెప్పి పవన్‌లో కొత్త ఆశలు రేపాడు. దాంతో తానూ రన్నింగ్ చేయాలనే ఆలోచన అతని మదిలో పుట్టింది. అప్పటినుంచి పూర్తి స్థాయిలో రన్నింగ్‌పై దృష్టి పెట్టాడు. మారథాన్‌లలో తన పరుగును చూసి అతనిలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.

 ఫుల్‌టైమ్ ప్రాక్టీస్...
 బ్లేడ్న్న్రర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆశిస్తున్న పవన్ రెగ్యులర్‌గా సాధన ప్రారంభించాడు. కాలికి అమర్చుకునే బ్లేడ్ దాదాపు 300 కిలోల వరకు బరువును ఆపగలగుతుంది. కాబట్టి సాధన సమయంలో అసలు కాలు లేదనే ఆలోచన కూడా మనసులో రానీయకుండా సాధారణ అథ్లెట్లతో అతను ప్రాక్టీస్ కొనసాగించాడు. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ కూడా ఈ విషయంలో అతనికి సహకరించారు. గతంలో చైనాలో జరిగిన పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో అతను పతకాలు గెల్చుకున్నాడు. అయితే ఇప్పుడు అంతిమ లక్ష్యం మాత్రం పారాలింపిక్స్‌లో పాల్గొనడమే.

వచ్చే నెలలో దుబాయ్‌లో మొదటి అర్హతా పోటీలు ఉన్నాయి. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఇటలీలలో కూడా క్వాలిఫయింగ్ ఈవెంట్లు ఉన్నాయి. 100 మీటర్లలో కనీస క్వాలిఫయింగ్ టైమింగ్ 12 సెకన్లు కాగా...ప్రస్తుతం పవన్ 13 సెకన్లలో పూర్తి చేస్తున్నాడు. 200 మీటర్లలో కూడా ఒక సెకను తేడా ఉంది. సాధనతో దానిని సరి చేస్తానని అతను పట్టుదలగా చెబుతున్నాడు. అయితే కొత్త బ్లేడ్ కొనుక్కుంటే కానీ ఇది సాధ్యం కాదు. అందుకోసం క్రీడలను ప్రోత్సహించేవారు ఎవరైనా తనకు స్పాన్సర్‌షిప్ అందించి సహకరించాలని ఈ పారా అథ్లెట్ కోరుతున్నాడు.
 
 ‘పాత బ్లేడ్ ఇటీవలే విరిగిపోయింది. ప్రస్తుతం రిపేర్‌లో ఉంది. అది బాగైనా మునుపటి స్థాయిలో బాగా పని చేయకపోవచ్చు. ఒలింపిక్స్ స్థాయిలో పోటీ పడాలంటే ప్రత్యేకంగా అమెరికాలో చేయించిన బ్లేడ్ వాడాల్సి ఉంటుంది. దాంతో ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం ఉంటుంది. దాని విలువ రూ. 4 లక్షలు. నా ఆర్థిక స్థితికి అది సాధ్యం కాదు. సాధన, శ్రమించేందుకు నేను ఎంతకైనా సిద్ధం. కానీ డబ్బులు పెద్ద సమస్య. ఈ సమయంలో స్పాన్సర్‌షిప్ లభిస్తే నా ఒలింపిక్స్ కల నెరవేరుతుంది.’   - పవన్ కుమార్

 పవన్‌కు సాయం చేయాలనుకునేవారు అతని తండ్రి శ్రీనివాస్‌ను 9550754389 నంబరులో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు