బ్లాటర్ రాజీనామా

3 Jun, 2015 01:32 IST|Sakshi
బ్లాటర్ రాజీనామా

ఫిఫా అధ్యక్ష పదవికి గుడ్‌బై   డిసెంబరు తర్వాత కొత్త ప్రెసిడెంట్
 
 జ్యూరిచ్ : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత శుక్రవారం ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన జోసెఫ్ సెప్ బ్లాటర్... తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలు వెల్లడి కాలేదు. 1998లో తొలిసారి ఫిఫా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బ్లాటర్... 17 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగారు. ‘నా వారసుడిని ఎన్నుకోవడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను’ అంటూ మంగళవారం జ్యూరిచ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బ్లాటర్ వ్యాఖ్యానించారు.

2011లో స్వీకరించిన ముడుపుల కేసులో ఇప్పటికే తన సహచరులు అరెస్ట్ కావడంతో ఆయన కాస్త ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. మరోవైపు యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘాలు ప్రపంచకప్‌లో పాల్గొనకుండా బ్లాటర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి.  నార్త్ అమెరికా దేశాలతో కలిసి ‘ఫిఫా’ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో అయోమయానికి గురైన బ్లాటర్ రాజీనామాకు సిద్ధపడ్డారు.

అయితే ఇప్పుటికిప్పుడు ఆయన ఫిఫాను వదిలి వెళ్లే అవకాశాల్లేవు. నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి డిసెంబర్-మార్చి మధ్యలో మళ్లీ ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునే వరకు ఆయనే పదవిలో కొనసాగుతారు.

మరిన్ని వార్తలు