స్ఫూర్తి పెంచే ‘మెర్రిట్’

29 Aug, 2015 23:51 IST|Sakshi
స్ఫూర్తి పెంచే ‘మెర్రిట్’

అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆపరేషన్ చేసి ఓ కిడ్నీ మారిస్తే తప్ప బతకడు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా తల్లడిల్లిపోతారు. కానీ అమెరికా అథ్లెట్ యారిస్ మెర్రిట్ మాత్రం ఏమాత్రం డీలా పడలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లోనూ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. అంతేకాదు... 110 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. 30 ఏళ్ల మెర్రిట్ ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్. ప్రపంచ రికార్డు కూడా అతని పేరిటే ఉంది. 2013లో తన కిడ్నీలు పాడయ్యాయని మెర్రిట్‌కు తెలిసింది. ఆ సమయంలో ఇక కెరీర్‌ను ముగిస్తే మంచిదని వైద్యులు సూచించారు. కానీ తను మాత్రం మొండిగా శిక్షణ కొనసాగించాడు.

ప్రస్తుతం చైనాలో జరుగుతున్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ముగియగానే సెప్టెంబరు 1న మెర్రిట్‌కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. అతడి సోదరి తన కిడ్నీని మెర్రిట్‌కు ఇస్తోంది. తన చెల్లి చేస్తున్న త్యాగానికి విలువ ఉండాలంటే రియో ఒలింపిక్స్‌లో తాను పతకం గెలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఏమైనా తన పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మరిన్ని వార్తలు