ఏడేళ్ల తర్వాత తొలిసారి..

14 Jan, 2020 20:52 IST|Sakshi

ముంబై:  వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అతిపెద్ద ఓటమిని చవిచూసింది. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఓటమి చెందడంతో భారత్‌కు ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలోనే వన్డేల్లో భారత్‌పై అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదైంది. భారత వన్డే చరిత్రలో అరోన్‌ ఫించ్‌-డేవిడ్‌ వార్నర్‌లు నెలకొల్పిన 258 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. అంతకుముందు 2016లో ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌-జార్జ్‌ బెయిలీ నెలకొల్పిన 242 పరుగులు రికార్డు ఓవరాల్‌గా భారత్‌పై అత్యధిక భాగస్వామ్యం కాగా, దాన్ని ఫించ్‌-వార్నర్‌ల జోడి బ్రేక్‌ చేసింది. ఈ జాబితాలో 2000వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా జోడి గ్యారీ కిరెస్టన్‌-గిబ్స్‌ల జోడి భారత్‌పై 235 పరుగుల భాగస్వామ్యం మూడో స్థానంలో ఉండగా, 2003లో ఆసీస్‌ జోడి రికీ పాంటింగ్‌- మార్టిన్‌లు నెలకొల్పిన 234 పరుగుల భాగస్వామ్యం నాల్గో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో మళ్లీ ఫించ్‌-వార్నర్‌లే ఉన్నారు. 2017లో భారత్‌తో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌-పించ్‌లు 231 పరుగులు సాధించారు. (ఇక్కడ చదవండి: టీమిండియా ఘోర పరాజయం)

ఇదిలా ఉంచితే, భారత్‌పై ఒకే వన్డేలో ఇద్దరు ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు శతకాలు సాధించడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2013లో ఉపల్‌ తరంగా-మహేలా జయవర్ధనే(శ్రీలంక), డీకాక్‌-ఆమ్లా(దక్షిణాఫ్రికా)లు భారత్‌పై చివరిసారి సెంచరీలు సాధించిన ఓపెనర్లు కాగా, ఏడేళ్ల తర్వాత వారి సరసన ఫించ్‌-వార్నర్‌లు నిలిచారు.  . మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వాంఖేడే వేదికగా జరిగిన మొదటి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు 255 పరుగులకే పరిమితమైతే.. దాన్ని ఆసీస్‌ అవలీలగా ఛేదించింది. కనీసం వికెట్‌ కూడా కోల్పోకుండానే భారత్‌ను చిత్తు చేసింది. ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌-అరోన్‌ ఫించ్‌లు సెంచరీల మోత మోగించి ఘన విజయాన్ని అందించారు. భారత్‌ నిర్దేశించిన 256 పరుగుల టార్గెట్‌ను 37. 4 ఓవర్లలోనే కొట్టేసిన ఆసీస్‌.. సిరీస్‌లో శుభారంభం చేసింది.  వార్నర్‌(128 నాటౌట్‌; 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫించ్‌(110 నాటౌట్‌;114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆసీస్‌ భారీ విజయంలో సహకరించారు. (ఇక్కడ చదవండి: ఈసారి ‘సెంచరీ’ లేదు!)

మరిన్ని వార్తలు