ఏబీ డివిలియర్స్‌ రీఎంట్రీ..!

15 Dec, 2019 19:06 IST|Sakshi
ఏబీ డివిలియర్స్‌-మార్క్‌ బౌచర్‌(ఫైల్‌ఫొటో)

కేప్‌టౌన్‌: గతేడాది ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ తర్వాత దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే.  జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే సందర్భంలో వర్క్‌ లోడ్‌ ఎక్కువ  అయిపోయిందని భావించిన డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తాను జాతీయ జట్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ జరిగిన తరుణంలో  మళ్లీ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్‌ ప్రయత్నాలు కూడా చేశాడు.తాజాగా దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌ నియామకం జరగడంతో డివిలియర్స్‌ రీఎంట్రీ షురూ అయ్యేలా కనబడుతోంది. ఈ విషయంపై తన సహచరుడు, సన్నిహితుడు ఏబీని అడుగుతానని బౌచర్‌ వెల్లడించాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ఉంచడమే తన ముందున్న లక్ష్యమని బౌచర్‌ పేర్కొన్నాడు.

ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న ఏబీతో చర్చలు జరుపుతానని తెలిపాడు. అతనొక అత్యుత్తమ ఆటగాడని,  ఇంకా జాతీయ జట్టుకు ఆడే సత్తా ఉందన్నాడు. తానెందుకు ఏబీ రిటైర్మెంట్‌ను పునః సమీక్షించుకోమని చర్చించుకూడదని మీడియాను ఎదురు ప్రశ్నించాడు. ఏబీతో పాటు మరికొంతమంది రిటైర్డ్‌ ఆటగాళ్లతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. తాను ప్రస్తుతం చేపట్టిన పదవే  అత్యుత్తమ ఆటగాళ్లను వెలికి తీయడం అన్నాడు. శనివారం దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా బౌచర్‌ నియామకం జరిగింది. దక్షిణాఫ్రికా తాత్కాలిక డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌.. బౌచర్‌ను కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరకూ బౌచర్‌ సఫారీల కోచ్‌గా కొనసాగనున్నాడు.

మరిన్ని వార్తలు