పాక్‌ బాయ్స్‌.. నన్ను అడగండి: బాక్సర్‌

18 Jun, 2019 16:20 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ పాకిస్తాన్‌ ఘోర వైఫల్యం చెందడంపై ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ విషయంలో శ్రద్ధ లేకపోవడం వల్లే గెలవడానికి ఆపసోపాలు పడుతున్నారని  విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీనిపై పాక్‌ సంతతికి చెందిన బ్రిటీష్‌ బాక్సర్‌ అమిర్‌ ఖాన్‌ స్పందించాడు. ఫిట్‌నెస్‌ విషయంలో తన సలహాలు తీసుకోవాలంటూ పాక్‌ క్రికెటర్లకు సూచించాడు. ‘ఫిట్‌నెస్‌ విషయంలో నేను పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఫిట్‌గా ఎలా ఉండాలో నేను నేర్పిస్తా. ఏ రకమైన ఆహార నియమాలు పాటించాలో చెబుతా. దాంతోపాటు శిక్షణ కూడా ఇస్తా. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో టాలెంట్‌కు కొదవలేదు. కానీ వారి ఫిట్‌నెస్‌ పరంగా మెరుగవ్వాలి’ అని అమిర్‌ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ‘సర్ఫరాజ్‌ స్లీప్‌ ఫీల్డర్‌’)


 

భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటా

వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు ఎదురైన ఓటమికి తాను ప్రతీకారం తీర్చుకుంటానని అమిర్‌ అన్నాడు. జూలై 12వ తేదీన సౌదీ అరేబియా వేదికగా జరుగనున్న బాక్సింగ్‌ పోరులో భారత బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ను నాకౌట్‌ చేస్తానంటూ సవాల్‌ విసిరాడు. ఇది మెగాటోర్నీలో భారత్‌పై పాక్‌కు ఎదురైన ఓటమికి ప్రతీకారంగా భావిస్తానన్నాడు. దీనికి నీరజ్‌ గోయత్‌ స్పందిస్తూ..  ‘అలాగే కలలు కంటూ ముందుకు సాగు. నా విజయానికి నువ్వే సాక్షి. అదే సమయంలో భారత్‌ కూడా నీ ఓటమిని చూస్తుంది’ అంటూ కౌంటర్‌ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు