ఒలింపిక్ ప్లేయర్కు స్కూలు మెడల్..

20 Aug, 2016 18:25 IST|Sakshi
ఒలింపిక్ ప్లేయర్కు స్కూలు మెడల్..

ఒలింపిక్ గేమ్స్ అనగానే ప్రపంచమంతా వాటిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తమ దేశానికి చెందిన ఆటగాళ్లతో పాటు తమ అభిమాన ప్లేయర్స్ స్వర్ణాలు సాధిస్తారా.. లేక ఏ పతకం తీసుకోస్తారా అని ఆలోచిస్తుంటారు. ఓ ఐదేళ్ల బుడ్డోడు తన అభిమాన బాక్సర్‌ రియోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో విరోచితంగా పోరాడినా ఓటమిపాలవడాన్ని చూసి జీర్ణించులేకపోయాడు. దీంతో తన దృష్టిలో విజేత ఓడిన బాక్సర్ అని అతడికి తన తరఫున ఓ గిఫ్ట్ పంపాడు.

ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల రియోలో జరిగిన 56కేజీల బాక్సింగ్‌ పోటీలో ఐర్లాండ్‌కి చెందిన మైకేల్‌ కొన్లన్‌ అనే బాక్సర్ రష్యాకు చెందిన వ్లాదిమిర్‌ నికిటిన్‌తో తలపడ్డాడు. ప్రత్యర్థిపై మైకెల్ పంచ్‌ల వర్షం కురిపించి రక్తం వచ్చేలా కొట్టాడు. దీంతో మైకేల్ గెలుస్తాడని అందరితో పాటు డబ్లిన్కు చెందిన ఐదేళ్ల బుడ్డోడు ఫిన్ మెక్ మనస్ అనుకున్నాడు. అయితే జడ్జీలు మాత్రం వ్లాదిమిర్ గెలిచినట్లు ప్రకటించారు. మైకెల్ తీవ్ర అసహనాన్ని వెల్లగక్కిన దృశ్యాన్ని టీవీలో చూసి బాలుడు ఫిన్ చలించిపోయాడు.

బాక్సర్ మైకెల్ కు లేఖతో పాటు స్కూళ్లో తాను గెలిచిన ఓ మెడల్ పంపించాడు. 'ప్రపంచంలో నువ్వు బెస్ట్ బాక్సర్, అందుకే నువ్వే నా చాంపియన్. టీవీలో నీ మ్యాచ్ చూశాను. వాస్తవానికి నువ్వే విజేతవు అందుకే నా మెడల్ నీకు పంపుతున్నాను' అని లేఖలో చిన్నారి ఫిన్ రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన బాక్సర్ మైకెల్ ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ.. 'ఐదేళ్ల బాలుడు ఫిన్ గురించి ఎవరికైనా తెలిస్తే అతడికి తాను ఓ బహుమతిని పంపిస్తానని తెలియజేయండి' అని ట్వీట్ లో రాసుకొచ్చాడు.

మరిన్ని వార్తలు