మరో ప్రాణం తీసిన బాక్సింగ్‌ రింగ్‌

17 Oct, 2019 12:53 IST|Sakshi

చికాగో: గత జూలై నెలలో ఇద్దరు బాక్సర్లు రోజుల వ్యవధిలో బాక్సింగ్‌ రింగ్‌లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన మరువకముందే మరొక బాక్సర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థి నుంచి వచ్చిన ముష్టిఘాతాలకు తాళలేకపోయిన అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ పాట్రిక్‌ డే ప్రాణాలు కోల్పోయాడు. బాక్సింగ్‌ బౌట్‌లో తలకు తీవ్ర గాయాలు కావడంతో నాలుగు రోజుల పాటు కోమాలోకి వెళ్లిన పోయిన పాట్రిక్‌.. చివరకు తుది శ్వాస విడిచాడు.

శనివారం చికాగలో జూనియర్‌ మిడిల్‌వెయిట్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా చార్లస్‌ కాన్‌వెల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్రిక్‌ నాకౌట్‌ అయ్యాడు. చార్లస్‌ కాన్‌వెల్‌ నుంచి వచ్చిన బలమైన పంచ్‌లకు రింగ్‌లో నిలబడలేకపోయిన పాట్రిక్‌ అక్కడే కులబడిపోయాడు. దాంతో అతన్ని స్ట్రెచర్‌ సాయంతో ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పాట్రిక్‌ను బతికించడం కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. నాలుగు రోజు పాటు మృత్యువుతో పోరాడిన పాట్రిక్‌ దాన్ని జయించలేకపోయాడు. బుధవారం ప్రాణం విడిచినట్లు అతని ప్రమోటర్‌ డిబెల్లా ఓ ప్రకటనలో తెలిపారు.  ఇటీవల  రష్యా చెందిన బాక్సర్‌ మాక్సిమ్‌ డడ్‌షెవ్‌, అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్‌లకు ఇదే తరహాలో మృత్యువాత పడ్డారు.

మరిన్ని వార్తలు