షోకాజ్‌కు బదులిచ్చిన బాక్సర్లు

17 Sep, 2013 02:04 IST|Sakshi
షోకాజ్‌కు బదులిచ్చిన బాక్సర్లు


 న్యూఢిల్లీ: సెలక్షన్ ట్రయల్స్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన భారత బాక్సర్లు దినేశ్ కుమార్ (91 కేజీ), దిల్బాగ్ సింగ్ (69 కేజీ), ప్రవీణ్ కుమార్ (ప్లస్ 91 కేజీ)లు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చారు. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో రిఫరీలు, కోచ్‌లు రింగయ్యారని, ముడుపులు తీసుకొని అనర్హులను ఎంపిక చేశారని ఈ ముగ్గురు ఆరోపించారు. ఇవి దుమారం రేగడంతో భారత బాక్సింగ్ సమాఖ్య చీఫ్ అభిషేక్ మటోరియా క్రమశిక్షణ కమిటీని నియమించారు.
 
  కమిటీ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా... వారు వివరణ లేఖలు ఇచ్చినట్లు మటోరియా తెలిపారు. అయితే 20న జరిగే కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ముగ్గురిలో దినేశ్, ప్రవీణ్‌లు రాజీకొచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఇద్దరు క్షమాపణ కోరుతూ లేఖలిచ్చినట్లు తెలిసింది. అయితే లేఖల్లో క్షమాపణ కోరారో లేదో తనకు తెలియదని మటోరియా చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు