స్టీవ్‌ స్మిత్‌ మరోసారి రచ్చరచ్చ

26 Dec, 2019 12:37 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ‘బాక్సింగ్‌ డే టెస్టు’తొలి రోజు చిన్నపాటి వివాదం చెలరేగింది. ఇంగ్లండ్‌ సీనియర్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌ తీరుపై ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన స్టీవ్‌ స్మిత్‌ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. ఇదే క్రమంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న షేన్‌ వార్న్‌ సైతం అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడికి ఐసీసీ నిబంధనల పుస్తకాన్ని ఇవ్వాలని ఎద్దేవాచేశాడు. 

అయితే ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే స్మిత్‌ క్రీడా స్పూర్థికి విరుద్దంగా ప్రవర్తించాడని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. అంతేకాకుండా ఆసీస్‌ ఆటగాళ్లకు దురుసు ఎక్కువ అనే విషయం ఈ ఒక్క సంఘటన నిరూపితమైందని మరి కొంత మంది పేర్కొంటున్నారు. ‘టెస్టు క్రికెట్‌లో ఒక్క పరుగు కోసం అది కూడా న్యాయబద్దం కాని దాని కోసం పోట్లాడిన ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

అసలేం జరిగిందంటే..
టాస్‌ గెలిచిన కివీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఆసీస్ పరుగుల వేట ప్రారంభించింది. అయితే ఆరంభంలేనే ఆతిథ్య జట్టుకు గట్టి షాక్‌ తగిలింది 61 పరుగులకే వార్నర్‌, బర్స్న్‌ వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్మిత్‌, లబుషేన్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌(బ్రేక్‌కు ముందు ఓవర్‌) సందర్భంగా కివీస్‌ బౌలర్ వాగ్నర్‌ వేసిని షార్ట్‌ పిచ్‌ బాల్‌ స్మిత్‌ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో సింగిల్‌ తీసే ప్రయత్నం చేశారు. అయితే బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ తీసే ప్రయత్నాన్ని అంపైర్‌ నిగేల్‌ లాంగ్‌ అడ్డుకున్నాడు. 

ఎందుకంటే అ బంతిని స్మిత్‌ ఆడాలనుకోలేదు. వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆ బంతి స్మిత్‌ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్‌ బంతిని కొట్టడానికి చేసే ప్రయత్నంలో బంతి బ్యాట్‌ను మిస్సై శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే కౌంట్‌ అవుతుందని.. ఇదే విషయాన్ని స్మిత్‌కు అంపైర్‌ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా అంతకుముందు ఓవర్‌లో కూడా జరగడంతో స్మిత్‌ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్‌ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ స్మిత్‌ వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. 

అయితే కామెంటరీ బాక్స్‌లో ఉన్న షేన్‌ వార్న్‌ అంపైర్‌ తీరును తప్పుపట్టారు. అంపైర్‌ది చెత్త నిర్ణయం అంటూ మండిపడ్డాడు. షార్ట్‌ పిచ్‌ బంతికి బ్యాట్స్‌మన్‌ శరీరంలో ఎక్కడ తగిలినా పరుగు తీయవచ్చనే నిబందన ఉందని పేర్కొన్నాడు. ‘నాకు తెలిసి అంపైర్‌కు ఐసీసీ నిబంధనల బుక్‌ అవసరం ఉందునుకుంటున్నా. బ్రేక్‌ సమయంలో ఎవరైనా ఇవ్వండి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ఈ వివాదంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు