అంత పిచ్చా.. సెమీఫైనల్‌ను పట్టించుకోరా..!

14 Jul, 2019 12:27 IST|Sakshi

లండన్‌ : అసలే అది ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీ. చిరకాల ప్రత్యర్థులు రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ మధ్య సెమీస్‌ పోరు. ఇక టెన్నిస్‌ అభిమానులకు పండగే పండగ. వేలమంది అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. మ్యాచ్‌ మొదలైంది. దిగ్గజ ఆటగాళ్ల బ్యాట్లనుంచి మునుపెన్నడూ చూడని షాట్ల వర్షం కురుస్తోంది. కానీ, ఇవేవీ వీక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఓ కుర్రాడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. తన పనిలో మునిగిపోయాడతను. కెమెరాలో అతను చేస్తున్న తెలిసి అందరి దృష్టి అటువైపు మళ్లింది. అంత ఉత్కంఠకర మ్యాచ్‌ జరుగున్న సమయంలో ఆ కుర్రాడు శ్రద్ధగా పుస్తకం చదువుకుంటున్నాడు. దీంతో కొందరు ఆ కుర్రాడిపై ఫన్నీ కామెంట్లతో ట్విటర్‌ని హోరెత్తించారు.
(చదవండి : జొకోవిచ్ X ఫెడరర్‌)

కుర్రాడికి ఫెదరర్‌, నాదల్‌ దిగ్గజ ఆటగాళ్లుగా కనబడటం లేదా. ఈ సమయంలో కూడా అతను పుస్తకం చదవడమేంటని అంటున్నారు. ఎప్పుడూ ఐపాడ్‌ చేతిలో పట్టుకుని తిరిగే ఈరోజుల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పుస్తకాల పురుగులైతే మాత్రం.. ఫెదరర్‌, నాదల్‌ మధ్య జరిగే సెమీస్‌ మ్యాచ్‌ను పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత ఉత్కంఠ మ్యాచ్‌లో పుస్తకం చదువుతున్నాడంటే.. అది కచ్చితంగా ఈ ప్రపంచంలోనే ది బెస్ట్‌ బుక్‌ కావొచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక శుక్రవారం 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌ పోరులో ఫెదరర్‌ 7–6 (7/3), 1–6, 6–3, 6–4తో మూడో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. వరుసగా 21వ ఏడాది వింబుల్డన్‌ టోర్నీలో ఆడుతున్న 37 ఏళ్ల ఫెడరర్‌ 12వసారి ఫైనల్‌కు చేరాడు. 8 సార్లు టైటిల్‌ నెగ్గిన అతను మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు రెండో సీడ్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌), జొకోవిచ్‌ (సెర్బియా) మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.
 

మరిన్ని వార్తలు