‘ఆసక్తికర చర్చ మొదలెట్టి.. ముగించేశాడు’

24 Mar, 2020 20:55 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో వివాదాలు రేపాలన్నా, దేనిపైనైనా ఆసక్తికర చర్చ తెరపైకి తీసుకరావాలన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లకే సాధ్యం. ఎందుకంటే వారు మాటలతో యుద్దం చేయగలరు.. అదేవిధంగా గారడీ చేయగలరు. తాజాగా కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్‌ టోర్నీలు రద్దు కావడంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఖాళీ సమయంలో ఏం చేయాలో పాలుపోని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ ఓ ఆసక్తికర చర్చను సోషల్‌ మీడియాలో తీసుకొచ్చాడు. 

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో బెన్‌ స్టోక్స్‌, హార్దిక్‌ పాండ్యాలలో బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ ఎవరంటూ ప్రశ్నిస్తూ క్రికెట్‌ అభిమానులకు రెండు ఆప్షన్స్‌ ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు తమతమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం తన ఛాయిస్‌ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌​ స్టోక్స్‌ అంటూ చర్చను ముగించేశాడు. బెన్‌ స్టోక్స్‌ను ఎందుకు ఎంచుకున్నాననే విషయంపై కూడా స్పష్టత ఇచ్చాడు. స్టోక్స్‌తో సమానమైన సామర్థ్యం హార్దిక్‌ పాండ్యాకు ఉందని, కానీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం పాండ్యాకు ఎక్కువ లేకపోవడంతోనే తాను స్టోక్స్‌ వైపు మొగ్గు చూపానని తెలిపాడు. 

స్టోక్స్‌ ఇప్పటివరకు 63 టెస్టులు, 95 వన్డేలు, 26 టీ20ల్లో ఇంగ్లండ్‌ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ గెలుచుకోవడంలో స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. కాగా, హార్దిక్‌ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20లు భారత్‌ తరుపున ఆడాడు. వెన్ను గాయం కారణంగా గత కొంతకాలంగా పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.  

చదవండి:
హార్దిక్‌-అ‍య్యర్‌ల బ్రొమాన్స్‌
‘24 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను ఓడించారు’

మరిన్ని వార్తలు