బ్రాడ్‌మన్‌ తర్వాత కోహ్లినే!

27 Oct, 2018 04:56 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

రెండో వన్డే ‘టై’గా ముగియడం నా దృష్టిలో సరైన ఫలితమే. ఎందుకంటే ఇరు జట్ల బౌలర్లు కూడా తమ జట్టును గెలిపించే స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. కెప్టెన్లు ఇద్దరూ తమ బౌలింగ్‌ బలగాల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా టి20 క్రికెట్‌ ప్రభావం వల్ల వన్డేల్లో కూడా జోరు పెరిగింది. ఒక జట్టు 300 పరుగుల స్కోరు సాధించడం గతంలోలాగా అరుదుగా కాకుండా ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ వ్యాఖ్యానించాడు.

అతని మాటలు ఇప్పుడు నిజంలాగే అనిపిస్తున్నాయి. స్విచ్‌ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి పరుగులు చేసేస్తున్నాడు. కోహ్లి నిలకడ గురించి చెప్పాలంటే అద్భుతం అనే మాట కూడా సరిపోదు. అయితే దీనికి మించి అతను పరిస్థితులను అర్థం చేసుకుంటూ జట్టుకు ఏది అవసరమో దాని ప్రకారం తన ఆటను మార్చుకుంటూ ఆడటమే మరింత పెద్ద విశేషం. అతను బ్యాటింగ్‌కు వెళుతున్నాడంటే చాలు కచ్చితంగా సెంచరీ సాధిస్తాడనే విషయంలో కించిత్‌ కూడా సందేహం కనిపించడం లేదు. గతంలో ఇలాంటి స్థితి ఒక్క సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ విషయంలోనే కనిపించేది. నాడు బ్రాడ్‌మన్‌ మైదానంలోకి దిగుతుంటే చూడచక్కగా స్టైల్‌గా కనిపించేది.

ఇప్పుడు కోహ్లి తనదైన శైలిలో గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో వెళుతుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా చేయడం లేదు. అయితే భారత జట్టు ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో మ్యాచ్‌లో మలుపులు సాగుతున్నప్పుడు మాత్రం తన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ కోహ్లి మామూలు మానవుడిలా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్‌ను ఈసారి 300లోపు కట్టడి చేసే బౌలింగ్‌ బలగం భారత్‌కు ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. గత మ్యాచ్‌లకంటే ఈసారి మరింత మెరుగ్గా ఫీల్డింగ్‌ చేయాలని కూడా జట్టు భావిస్తోంది. రనౌట్‌కు అవకాశం లేకున్నా అనవసరంగా స్టంప్స్‌పైకి బంతిని విసిరే అలవాటుపై కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టి పెట్టాల్సి ఉంది.

మరిన్ని వార్తలు