విండీస్‌కు ఆధిక్యం

11 Jul, 2020 01:57 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 318 ఆలౌట్‌

రాణించిన బ్రాత్‌వైట్, డౌరిచ్‌

స్టోక్స్‌కు 4 వికెట్లు  

సౌతాంప్టన్‌: తొలి టెస్టు మూడోరోజూ వెస్టిండీస్‌దే పైచేయి. ఆతిథ్య ఇంగ్లండ్‌ బౌలర్లపై బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించడంతో విండీస్‌ ఆధిక్యంలో పడింది. ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో  వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 318 పరుగుల వద్ద  ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 114 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌ తాత్కాలిక కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (4/49), అండర్సన్‌ (3/62) ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి గండికొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. బర్న్స్‌ 10 పరుగులతో, సిబ్లీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ ఇంకా 99 పరుగుల వెనుకంజలో ఉంది.

బ్రాత్‌వైట్‌ అర్ధ శతకం... 
ఓవర్‌నైట్‌ స్కోరు 57/1తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన వెస్టిండీస్‌ను ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ బ్రాత్‌వైట్, షై హోప్‌ బాధ్యతగా నడిపించారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టు స్కోరు వందకు చేరింది. దీనికి కాసేపటికే హోప్‌ (16; 1)ను డామ్‌ బెస్‌ ఔట్‌ చేసి ఇంగ్లండ్‌ శిబిరాన్ని ఊరడించాడు. రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక పట్టు బిగిద్దామనుకున్న ఇంగ్లండ్‌ ఆశల్ని క్రీజులోకి వచ్చిన బ్రూక్స్‌ (39; 6 ఫోర్లు), చేజ్‌ (47; 6 ఫోర్లు) వమ్ము చేశారు.  మొదట బ్రూక్స్‌ అండతో బ్రాత్‌వైట్‌ ఫిఫ్టీ పూర్తయింది. వీరి జోడీ సాఫీగా సాగుతున్న తరుణంలో బ్రాత్‌వైట్‌ను స్టోక్స్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాడు. కొద్దిసేపటికే జట్టు స్కోరు 150కి చేరుకుంది. 159/3 స్కోరు వద్ద విండీస్‌ లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. 

ఆదుకున్న డౌరిచ్‌... 
అనంతరం వెస్టిండీస్‌ కాస్త తడబడింది. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయింది. బ్రూక్స్‌ను అండర్సన్‌... బ్లాక్‌వుడ్‌ (12; 2 ఫోర్లు)ను బెస్‌ ఔట్‌ చేశారు. అయితే చేజ్‌కు వికెట్‌ కీపర్‌ డౌరిచ్‌ జతయ్యాక ఇన్నింగ్స్‌ మళ్లీ గాడిన పడింది. ఇద్దరు ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. చేజ్‌ నిష్క్రమించగా... డౌరిచ్‌ టెయిలెండర్ల అండతో అర్ధసెంచరీ సాధించాడు. జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. కాసేపటికే ఇంగ్లండ్‌ సారథి స్టోక్స్‌... జోసెఫ్‌ (18; 3 ఫోర్లు)తో పాటు డౌరిచ్‌నూ ఔట్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. గాబ్రియెల్‌ (4)ను మార్క్‌ వుడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో విండీస్‌ ఆలౌటైంది. మూడో రోజు కూడా అంపైరింగ్‌ పేలవంగా ఉంది. లెక్కకు మిక్కిలి తప్పుడు నిర్ణయాలతో విసుగు తెప్పించారు.

సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 204 ఆలౌట్‌
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 318 ఆలౌట్‌ (బ్రాత్‌వైట్‌ 65, డౌరిచ్‌ 61, చేజ్‌ 47; స్టోక్స్‌ 4/49, అండర్సన్‌ 3/62); ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 15/0 (బర్న్స్‌ 10 బ్యాటింగ్, సిబ్లీ 5 బ్యాటింగ్‌). 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా