బ్రెజిల్‌ దూసుకెళ్లింది

29 Jun, 2018 03:46 IST|Sakshi

నాకౌట్‌కు మాజీ చాంపియన్‌

సెర్బియాపై 2–0తో విజయం

మెరిసిన పాలిన్హో, తియాగో

సాకర్‌ ప్రపంచకప్‌లో జర్మనీలా బ్రెజిల్‌ కూలిపోలేదు. మరో షాక్‌కు తావివ్వలేదు. మరో పరాభవానికి చోటివ్వ లేదు. టైటిల్‌ ఫేవరెట్‌ బ్రెజిల్‌ అంచనాలకు తగ్గట్టే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లోనూ దూసుకుపోయింది. మెరుగైన ప్రదర్శనతో సెర్బియాపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.   

మాస్కో: జోరుమీదున్న బ్రెజిల్‌ నాకౌట్‌ దశకు చేరింది. ఐదుసార్లు చాంపియన్‌ అయిన బ్రెజిల్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 2–0 గోల్స్‌తో సెర్బియాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో బ్రెజిల్‌కిది వరుసగా రెండో విజయం. స్విట్జర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఆ జట్టు  రెండో మ్యాచ్‌లో కోస్టారికాపై గెలిచింది. దీంతో గ్రూప్‌ ‘ఇ’లో ఓటమి ఎరుగని బ్రెజిల్‌ టాపర్‌గా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. సెర్బియాతో బుధవారం జరిగిన పోరులో పాలిన్హో, తియాగో సిల్వా ఆకట్టుకున్నారు. ఇద్దరు చెరో గోల్‌ చేశారు.

మ్యాచ్‌ ఆరంభం నుంచే బ్రెజిల్‌ దాడులు మొదలయ్యాయి. కానీ సమన్వయం కుదరక నాలుగో నిమిషంలోనే గోల్‌ చేసే చక్కని అవకాశాన్ని కోల్పోయింది బ్రెజిల్‌. ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌కు అత్యంత సమీపంగా బంతిని తీసుకొచ్చిన జీసస్‌ షాట్‌... నెమార్, కౌటిన్హో సమన్వయలేమితో నిష్ఫలమైంది. ఆ తర్వాత కూడా బ్రెజిల్‌ పదేపదే లక్ష్యం దిశగా గురిపెట్టింది. ఎట్టకేలకు తొలి అర్ధభాగం ఆట 36వ నిమిషంలో కౌటిన్హో ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్‌ పాలిన్హో మెరుపువేగంతో గోల్‌ పోస్ట్‌లోకి తరలించాడు. దీంతో బ్రెజిల్‌ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. 1–0 ఆధిక్యంతో ఫస్టాఫ్‌ను ముగించింది.

డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. దీంతో బంతిని బ్రెజిల్‌ గోల్‌పోస్ట్‌వైపు తీసుకెళ్లేందుకే సెర్బియా ఆపసోపాలు పడింది. ఇక ద్వితీయార్ధంలోనూ బ్రెజిల్‌ ఆధిపత్యమే కొనసాగింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచేందుకు ఆటగాళ్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో బ్రెజిల్‌ రెండో గోల్‌ నమోదైంది. ఆట 68వ నిమిషంలో స్ట్రయికర్‌ నెమార్‌ కార్నర్‌ నుంచి ఇచ్చిన పాస్‌ను డిఫెండర్‌ తియాగో సిల్వా హెడర్‌ గోల్‌గా మలిచాడు. దీంతో 2–0 ఆధిక్యంతో దూసుకెళ్లిన బ్రెజిల్‌ను సెర్బియా ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ ఆటగాళ్లు  ఆరుసార్లు లక్ష్యంపై గురిపెట్టగా రెండు సార్లు విజయవంతమయ్యారు. ప్రత్యర్థి సెర్బియా జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే టార్గెట్‌కు చేరినప్పటికీ ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. జూలై 2న జరిగే ప్రిక్వా ర్టర్‌ ఫైనల్లో మెక్సికోతో బ్రెజిల్‌ ఆడుతుంది.

అభిమానుల ఘర్షణ
సాకర్‌ క్రేజ్‌ ఆకాశమంత అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్‌కప్‌ కోసం ప్రాణాలిస్తారు. చేదు ఫలితాలొస్తే జీర్ణించుకోలేక ప్రాణాలొదిలేస్తారు. మైదానంలో తమ జట్లు పోరాడితే... ప్రేక్షకుల గ్యాలరీల్లో అభిమానులు బాహాబాహీకి దిగుతుండటం కూడా ఇక్కడ సహజం. బ్రెజిల్, సెర్బియా మ్యాచ్‌ ముగిశాక ఇరు దేశాల అభిమానులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. పక్కనే ఉన్న మరో ప్రేక్షకురాలు ఇదంతా చూసి భయాందోళనకు గురైంది. పోలీసులు ఈ సంఘటనలో బాధ్యులైన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు