దక్కింది పన్నెండు వేలే!

3 May, 2015 02:55 IST|Sakshi
దక్కింది పన్నెండు వేలే!

ఇటీవల ముగిసిన క్రికెట్ ప్రపంచకప్‌లో తమ జట్టు ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్(29)ను ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. ఇండియాతో జరిగిన తన చివరి మ్యాచ్‌లో ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో టేలర్ జాతీయ జట్టునుంచి తప్పుకొన్నాడు. వయసును బట్టి చూసినా, బ్యాటింగ్ ఫామ్‌ను గమనించినా టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం ఆశ్చర్యమే. అయితే, ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ క్లబ్‌లో ఒప్పందం కుదుర్చుకొని ఆ జట్టు తరఫున ఆడటానికి టేలర్ జింబాబ్వే జాతీయజట్టు నుంచి తప్పుకొన్నాడు. జాతీయ జట్టుకు ఆడటానికీ, ఒక క్లబ్‌కు ఆడటానికీ మధ్య ఎంత తేడా ఉందో వేరే చెప్పనక్కర్లేదు.

 

అయినా ఎందుకు అలా చేశాడంటే, ప్రపంచకప్‌లో జింబాబ్వే తరఫున ఆడినందుకుగానూ టేలర్‌కు దక్కిన మొత్తం 12,000 రూపాయలు మాత్రమే! ఈ డబ్బుతో ఎలా బతకాలో అర్థం కాక జాతీయ జట్టుకు వీడ్కోలు పలికానని టేలర్ ప్రకటించాడు! ఈ ఆటగాడు తన బ్యాటింగ్‌తో వినోదాన్ని పంచగలడు,  జట్టును గెలిపించగలడు కాబట్టి టేలర్ తో ఇంగ్లండ్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో టేలర్ కు జింబాబ్వేతో పోల్చుకొంటే మంచి పారితోషికమే లభిస్తుంది. ఇలా జింబాబ్వే నుంచి ఇంగ్లండ్  తరలి వెళ్లిన ఆటగాళ్లలో టేలరే కాదు, సీన్ ఇర్విన్. , ముర్రే గుడ్విన్,, ఆండీ ఫ్లవర్ , ఆంటోనీ ఐర్లాండ్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు. గమనించదగ్గ అంశం ఏమిటంటే, వీళ్లంతా తెల్లజాతి వాళ్లే!

మరిన్ని వార్తలు