క్రికెట్‌కు మెకల్లమ్‌ వీడ్కోలు

7 Aug, 2019 07:29 IST|Sakshi

గ్లోబల్‌ టి20 లీగే ఆఖరిదని ప్రకటించిన కివీస్‌ స్టార్‌ ప్లేయర్‌

20 ఏళ్ల కెరీర్‌ పట్ల గర్వం, సంతృప్తితో ఈ రోజు నేను క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. ఎన్నో త్యాగాలు, ఎంతో నిబద్ధత అవసరమైన ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఇకపై కొనసాగలేనని కొన్ని నెలలుగా నాకు అనిపిస్తోంది. ఆటలో ప్రవేశించినప్పుడు ఈ స్థాయి ప్రయాణాన్ని ఊహించలేదు. త్వరలో జరిగే యూరో టి20 స్లామ్‌లో పాల్గొనను. ఆ టోర్నీ నిర్వాహకులకు ధన్యవాదాలు. విధ్వంసకరంగా ఆడటం నాకిష్టం. డ్యునెడిన్‌లోని కల్లింగ్‌ పార్క్‌ నుంచి ప్రఖ్యాత లార్డ్స్‌ వరకు ఎన్నో మధురానుభూతులున్నాయి. నా సహచరులందరికీ రుణపడి ఉంటాను.   –ట్విట్టర్‌లో మెకల్లమ్‌ రిటైర్మెంట్‌ ప్రకటన

ఆక్లాండ్‌: విధ్వంసక బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌... క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ పోటీ క్రికెట్‌ నుంచి 2016లోనే తప్పుకొన్న అతడు ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతున్నాడు. ప్రసుత్తం కెనడాలో జరుగుతున్న గ్లోబల్‌ టి20 లీగ్‌లో టొరంటో నేషనల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీనే తనకు ఆఖరిదని స్పష్టం చేశాడు. 37 ఏళ్ల మెకల్లమ్‌... దిగ్గజ మార్టిన్‌ క్రో తర్వాత న్యూజిలాండ్‌ అందించిన మరో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌. దూకుడైన ఆటకు పెట్టింది పేరు. కెరీర్‌ తొలినాళ్లలో వికెట్‌ కీపర్‌గా జట్టులోకి వచ్చినా, అనంతరం స్పెష లిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా పాతుకుపోయాడు. 2002లో వన్డే (సిడ్నీలో ఆస్ట్రేలియాపై), 2004లో టెస్టు (హామిల్టన్‌లో దక్షిణాఫ్రికాపై), 2005లో టి20 (ఆక్లాండ్‌లో ఆస్ట్రేలియాపై) అరంగేట్రం చేశాడు.  

కివీస్‌ను నిలిపి... ఐపీఎల్‌కు ఊపు తెచ్చి...
మెకల్లమ్‌ అంటే భారత క్రికెట్‌ అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది 2008 ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై అతడు ఆడిన 73 బంతుల్లో 158 పరుగుల ఇన్నింగ్సే. అప్పటివరకు లీగ్‌ పట్ల ఓ మాదిరిగా ఉన్న అంచనాలను మెకల్లమ్‌ కళ్లుచెదిరే ఆటతో ఎక్కడికో తీసుకెళ్లాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌ ఐపీఎల్‌ స్థాయిని అమాంతం పెంచిందనడంలో సందేహం లేదు. బంతిని బలంగా బాదే మెకల్లమ్‌కు... తన కెరీర్‌కు సమాంతరంగా ప్రారంభమైన టి20లు మరింత మేలు చేశాయి. అతడెంత ప్రమాదకర బ్యాట్స్‌మనో ప్రపంచానికి చాటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని టి20 లీగ్‌లలో కలిపి 370 మ్యాచ్‌లాడిన మెకల్లమ్‌ 9,922 పరుగులు చేయడమే దీనికి నిదర్శనం.  
టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (54 బంతుల్లో) రికార్డు మెకల్లమ్‌ పేరిటే ఉంది. 2016లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్టులో అతడీ రికార్డు నెలకొల్పాడు.
టెస్టుల్లో మెకల్లమ్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు (302)ను భారత్‌పైనే చేశాడు. 2014లో వెల్లింగ్టన్‌లో జరిగిన ఈ టెస్టులో అతడు అసాధారణ రీతిలో 775 నిమిషాలు క్రీజులో నిలిచి భారత్‌కు విజయాన్ని దూరం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కూడా మెకల్లమ్‌ గుర్తింపు పొందాడు.
అరంగేట్రం నుంచి ఏకధాటిగా 100 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్‌ మెకల్లమ్‌. క్రిస్‌ గేల్‌ తర్వాత టి20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా ఈ కివీస్‌ క్రికెటర్‌ నిలిచాడు.
2015లో వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌ జట్టుకు మెకల్లమే కెప్టెన్‌. ఆ టోర్నీలో విధ్వంసకరంగా ఆడిన అతడు జట్టును తుది సమరానికి చేర్చాడు. ఇటీవల వన్డే ప్రపంచ కప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌కు మెకల్లమ్‌ మంచి స్నేహితుడు. జట్టును నడిపించడంలో మెకల్లమ్‌ తనకు ఎంతో ప్రేరణగా నిలిచాడని మోర్గాన్‌ ప్రస్తుతించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా