మెకల్లమ్ 'సిక్సర్ల' ఘనత

13 Dec, 2015 18:03 IST|Sakshi
మెకల్లమ్ 'సిక్సర్ల' ఘనత

దునేదిన్:న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ మెకల్లమ్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మెకల్లమ్ ఒక ఓవర్ లో రెండు సిక్సర్లు బాది వంద సిక్సర్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా శ్రీలంక స్పిన్నర్ హెరాత్ ఓవర్ ను ఎదుర్కొన్న మెకల్లమ్(17 నాటౌట్; ఆరు బంతుల్లో 2 సిక్సర్లు) హిట్టింగ్ చేసి ఆ ఘనతను అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా లెజెండ్ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన మెకల్లమ్ నిలిచాడు. కాగా గిల్ క్రిస్ట్ 96 మ్యాచ్ ల్లో 100 సిక్సర్లను పూర్తి చేసుకుంటే, మెకల్లమ్ 98 మ్యాచ్ ల్లో ఆ ఘనతను సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో క్రిస్ గేల్(98), కల్లిస్(97),  వీరేంద్ర సెహ్వాగ్(91 సిక్సర్లు) లు ఉన్నారు.


ఇదిలా ఉండగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 405 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 171/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 267/3 వద్ద డిక్లేర్ చేసి భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్ లాథమ్(109నాటౌట్)  విలియమ్సన్(71) రాణించి న్యూజిలాండ్ భారీ స్కోరుకు సహకరించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 50.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కరుణరత్నే(29), కుశాల్ మెండిస్(46)ల, జయసుందర్(3) లు పెవిలియన్ కు చేరగా, చండీమాల్(31 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు.  ఇంకా శ్రీలంక విజయానికి 296 పరుగులు చేయాల్సి ఉండగా, ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు