‘ నా క్రికెట్‌ కెరీర్‌ను సంతృప్తిగా ముగిస్తున్నా’

6 Aug, 2019 11:14 IST|Sakshi

వెల్లింగ్టన్‌: సుమారు మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న న్యూజిలాండ్‌ క్రికెటర్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌.. తాజాగా కాంపిటేటివ్‌ క్రికెట్‌ కూడా గుడ్‌ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ ఆడబోనంటూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన మెకల్లమ్‌.. విదేశీ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్న మెకల్లమ్‌.. ఈ లీగ్‌ తర్వాత మొత్తం క్రికెట్‌కు దూరం కానున్నట్లు వెల్లడించాడు.

‘ నా క్రికెట్‌ జీవితాన్ని సంతృప్తిగా ముగిస్తున్నా. గ్లోబల్‌ టీ20 కెనడా తర్వాత ఇక క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడను. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మెకల్లమ్‌ పేర్కొన్నాడు.తన టెస్టు కెరీర్‌లో 101 టెస్టులు ఆడిన 37 ఏళ్ల మెకల్లమ్‌ 12 సెంచరీలతో 6,453 పరుగులు చేశాడు. అందులో 302 అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక 260 వన్డేల్లో 6,083 పరుగులు చేయగా, ఐదు సెంచరీలున్నాయి. 71 అంతర్జాతీయ టీ20ల్లో 2,140 పరుగులు చేశాడు. ఓవరాల్‌ టీ20(అన్ని లీగ్‌లతో కలిపి) కెరీర్‌లో 370 మ్యాచ్‌లు ఆడిన మెకల్లమ్‌ 9,922 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు