250 టార్గెట్‌ భారత్‌కు కష్టమే!

10 Jul, 2019 14:33 IST|Sakshi

కివీస్‌ మాజీ కెప్టెన్‌ మెక్‌కల్లమ్‌ ట్వీట్‌ 

మాంచెస్టర్‌ : భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారిన పరిస్థితుల్లో భారత్‌కు 250 పరుగుల లక్ష్యం సవాల్‌తోకూడుకున్నేదనని ట్వీట్‌ చేశాడు. ‘ఇరు జట్ల మధ్య జరిగే ధ్వైపాక్షిక సిరీస్‌ 250 పరుగుల లక్ష్యం సర్వసాధారణమే. కానీ విశ్వవేదికపై జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో మాత్రం కష్టమైనదే.’ అని పేర్కొన్నాడు. అయితే న్యూజిలాండ్‌  మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులే చేసింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మెక్‌కల్లమ్‌ను ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ నిలదీశాడు. ‘ఇంకా 250 చేయలేదు కదా’ అని కామెంట్‌ చేశాడు. దీనికి మెక్‌కల్లమ్‌ స్పందించాడు. ‘ఈ ప్రపంచకప్‌లో రెండు జట్లు (భారత్‌, బంగ్లాదేశ్‌) మాత్రమే 250, అంతకన్నా ఎక్కువ పరుగుల లక్ష్యాలను చేధించి విజయాలు సాధించాయి. ఆ రెండు జట్లపై అప్పుడు  ఎలాంటి సెమీఫైనల్‌ ఒత్తిడి లేదు. చీర్స్‌ కేపీ, రేపు(బుధవారం) మా వాళ్లు ఇరగదీస్తారు’ అని బదులిచ్చాడు.

లీగ్‌ దశలో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు మాత్రమే చేజింగ్‌లో విజయాలు సాధించాయి. వెస్టిండీస్‌పై 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి బంగ్లాదేశ్‌7 వికెట్లతో గెలవగా.. శ్రీలంకపై భారత్‌ 265 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించింది. మెక్‌కల్లమ్‌ అన్నట్లు 240 పరుగుల టార్గెట్‌ను చేధించడం భారత్‌కు కష్టమైన పనేనని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. వర్షం ఆగిన తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్‌ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగుతారని పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు