'కోహ్లి కంటే స్మిత్‌కే రేటింగ్‌ ఎక్కువిస్తా'

26 May, 2020 14:25 IST|Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తన దృష్టిలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కంటే ఎక్కువ రేటింగ్‌ ఇస్తానంటూ ఆసీస్‌ మాజీ ఆటగాడు బ్రెట్‌ లీ స్పష్టం చేశాడు. జింబాబ్వే పేసర్‌ పోమ్మీ మబాంగ్వాతో జరిగిన ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న బ్రెట్‌ లీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ' చూడండి.. స్మిత్‌, కోహ్లిలలో ఎవరు ఉత్తమం అనేది చెప్పడం కొంచెం కష్టమే.. ఎందుకంటే వారిద్దరి ఆటతీరులో లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి. బౌలింగ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి ఈ ఇద్దరిలో ఎవైనా లోపాలు ఉన్నాయోమోనని చూడడానికి ప్రయత్నిస్తా.. కానీ ఈ ఇద్దరు బ్యాటింగ్‌లో నిజాయితీగా ఉంటారు. కోహ్లి టెక్నికల్‌ అంశంలో ఏ ఇబ్బంది ఉండదు. కెరీర్‌ మొదట్లో దూకుడైన ఆటతీరును కనబరిచేవాడు.. ఇప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే కెప్టెన్‌గా మాత్రం ఒక ఉన్నతస్థానంలో ఉంటాడు.. ఐపీఎల్‌ టైటిల్‌ను గెలవాలనే ఆకాంక్ష అతనిలో బలంగా ఉందని నేను అనుకుంటున్నా.(సోనూసూద్‌.. నువ్వు రియల్‌ హీరో’)

ఇక స్మిత్‌ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల నుంచి అతని ఆటతీరు చూస్తున్నా.. కానీ గత 12 నెలల్లో అతని ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. ఆటలో కచ్చితత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు గొప్ప ఆటగాళ్లే.. అయినా ఈ సమయంలో మాత్రం నేను కోహ్లిని కాదని స్టీవ్‌ స్మిత్‌నే ఎన్నుకుంటాను. ఇంకా చెప్పాలంటే డాన్‌ బ్రాడ్‌మన్‌ కంటే స్మిత్‌ మంచి ఆటగాడిగా కనిపిస్తాడని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందంటూ' బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.
(‘రవి భాయ్‌.. బిర్యానీ పంపించా తీసుకోండి’)

మరిన్ని వార్తలు