ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో వేసినా..

5 Jun, 2020 14:25 IST|Sakshi

వేర్వేరు డైరెక్షన్‌లో సిక్స్‌లు కొట్టే సత్తా అతని సొంతం

నా దృష్టిలో ఆ ముగ్గురే అత్యుత్తమం: బ్రెట్‌ లీ

మెల్‌బోర్న్‌: ప్రపంచ క్రికెట్‌లో షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌ లీలది ప్రత్యేక స్థానం. తమ శకంలో వీరిద్దరూ  ఫాస్టెస్ట్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించిన సందర్భాలు అనేకం. అప్పట్లో సచిన్‌-బ్రెట్‌ లీ మధ్య పోరు, సచిన్‌-అక్తర్‌ల మధ్య పోటీ అనేది ఎక్కువగా ఉండేది. ఈ ఇద్దరిలో బ్రెట్‌ లీ కాస్త భిన్నం. బంతిని వేయడానికి రనప్‌ను తక్కువ తీసుకున్నా వేగంలో మాత్రం మార్పు ఉండేది కాదు. 1999లో భారత్‌పై అరంగేట్రం చేసిన బ్రెట్‌ లీ.. అనతికాలంలోనే ఆసీస్‌ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. కచ్చితమైన పరుగుతో అత్యంత వేగంగా బంతుల్ని సంధించడంలో దిట్ట బ్రెట్‌ లీ.  సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా, రాహుల్‌ ద్రవిడ్‌, బ్రియాన్‌ లారా, జాక్వస్‌ కల్లిస్‌, కుమార సంగక‍్కరా, ఇంజమాముల్‌ హక్‌, పీటర్సన్‌ వంటి దిగ్గజ క్రికెటర్లుకు బౌలింగ్‌ చేసినా, తన క్రికెట్‌ కెరీర్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు ముగ్గురే ఉన్నారంటున్నాడు బ్రెట్‌ లీ. వారిలో తొలి స్థానం సచిన్‌కు ఇవ్వగా, రెండో స్థానాన్ని విండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారాది కాగా, ఇక మూడో స్థానం దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌ రౌండర్‌ జాక్వస్‌ కల్లిస్‌ది. వీరినే తాను ఎందుకు ఎంపిక చేసుకున్నాననే దానిపై బ్రెట్‌ లీ వివరణ ఇచ్చాడు.(‘అందులో ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ భేష్‌’)

సచిన్‌లా ఎవరూ బ్యాటింగ్‌ చేయలేరు
‘సచిన్‌ తరహాలో ఎవరూ బ్యాటింగ్ చేయడం నేను చూడలేదు. ఎక్స్‌ట్రా టైమ్‌ తీసుకుని షాట్లు ఆడుతుంటాడు. క్రీజ్‌లో వచ్చాక నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. క్రీజ్‌లో కుదురుకున్నాడంటే ఈజీగా షాట్లు కొడతాడు. వరల్డ్‌లో సచినే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌’ అని లీ తెలిపాడు. 

ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో వేసినా..
ఇక లారా గురించి మాట్లాడుతూ.. ‘ లారా ఒక విభిన్నమైన లెఫ్ట్‌ హ్యాండర్‌. లారా హిట్టింగ్‌ బాగుంటుంది. ముఖ్యంగా సిక్స్‌లు కొట్టడంలో లారా దిట్ట. ఒక బౌలర్‌ ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో సంధించినా వేర్వేరు డైరెక్షన్‌లో సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం అతని సొంతం. అతను క్రికెట్‌ ఆడే కాలంలో చూపరులను ఇట్టే ఆకట్టుకునే వాడు’ అని తెలిపాడు. 

కల్లిస్‌ కంప్లీట్‌ క్రికెటర్‌
‘జాక్వస్‌ కల్లిస్‌ కంప్లీట్‌ క్రికెటర్‌. బ్యాట్స్‌మన్‌గా ఎంతలా రాణిస్తాడో, బౌలర్‌గా అదే స్థాయిలో రాణించే ఆటగాడు కల్లిస్‌. అవసరమైతే ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా దిగగలడు, ఓపెనింగ్‌ ఓవర్‌ను కూడా వేయగలడు. ఫీల్డర్‌గా కూడా కల్లిస్‌ది ప్రత్యేక స్థానం. స్లిప్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్న చరిత్ర కల్లిస్‌ది. నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్‌ కల్లిస్‌. సచిన్‌ తాను చూసిన బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అయితే కల్లిస్‌ బెస్ట్‌ క్రికెటర్‌’ అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు