ఆశ్చర్యానికి గురయ్యాను: బ్రెట్ లీ

19 Feb, 2020 13:56 IST|Sakshi

సిడ్నీ: మహిళా క్రికెట్‌లో ఆస్ట్రేలియా- ఇండియా జట్లు అత్యుత్తమమైనవని.. వుమెన్‌ క్రికెట్‌ను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లగల సత్తా ఇరుజట్లకు ఉందని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 17 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా వేదిక కానుంది. టైటిల్‌ వేట కోసం ఇప్పటికే 10 జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టోర్నమెంట్‌ గురించి బ్రెట్‌ లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆసీస్‌- భారత వంటి మేటి జట్ల మధ్య సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌తో మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుందని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.(భారత్‌ను గెలిపించిన పూనమ్‌ )

‘‘ఆస్ట్రేలియాలోని క్రికెట్‌ మైదానాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఇలాంటి మైదానాల్లో మహిళా క్రికెట్‌ వరల్డ్‌కప్‌ జరగడం ఎంతో బాగుంది. ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన, టెస్టుల్లో అరంగేట్రం చేసిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతుండటం ఇంకా అద్భుతంగా ఉంది. మహిళా క్రికెటర్లు ఎదుగుతున్న తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మెగా ఈవెంట్‌ ఎన్నెన్నో మధురానుభూతులకు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఇక ఇండియా విషయానికొస్తే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి బ్యాట్‌వుమన్లతో జట్టు దృఢంగా ఉంది. కాబట్టి భారత జట్టు ఆటతీరుపై కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు వారిని గమనించాలి. ఊహించిన స్థాయిలో మహిళా క్రికెటర్లు రాణిస్తే.. వారికి ఆకాశమే సరిహద్దు అనే  మాట నిజమవుతుంది’’ అని బ్రెట్‌ లీ రాసుకొచ్చాడు. (చదవండి : ఆల్‌ ద బెస్ట్‌ హర్మన్‌)

కాగా,  ప్రస్తుతం జరగబోయేది ఏడో మహిళా టి20 ప్రపంచకప్‌. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) చాంపియన్‌గా నిలవగా.. ఇంగ్లండ్‌ (2009), వెస్టిండీస్‌ (2018) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్‌ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల అమెరికన్‌ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్‌ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు.  

మరిన్ని వార్తలు