కోహ్లి క్రికెట్‌ రొనాల్డో: లారా

17 Dec, 2019 02:00 IST|Sakshi
భారత రాష్ట్రపతికి బ్యాట్‌ అందజేస్తున్న లారా

విశాఖపట్నం: వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోతో పోల్చాడు. అతని శారీరక సామర్థ్యం, మానసిక సై్థర్యం, బ్యాటింగ్‌ నైపుణ్యం అసాధారణమని 50 ఏళ్ల లారా ప్రశంసించాడు. మూడు ఫార్మాట్లలోనూ ఎవరికీ సాధ్యం కానీ 50 పరుగుల సగటు అతనిదని కితాబిచ్చాడు. ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన లారా మీడియాతో మాట్లాడుతూ ‘నా దృష్టిలో కోహ్లి క్రికెట్‌ రొనాల్డో.

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌కు కోహ్లి ఏ మాత్రం తీసిపోడు. ఆటలో, సన్నాహకంలో అతని నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే.  బ్యాటింగ్‌లో అతను కష్టపడేతత్వం గొప్పగా ఉంటుంది. ఏ తరం క్రికెట్‌ జట్టుకైనా సరిగ్గా సరిపోయే బ్యాట్స్‌మన్‌ అతను’ అని విరాట్‌ను ఆకాశానికెత్తాడు. అంతకుముందు ఢిల్లీలో ఈ విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా లారా క్రికెట్‌కు చేసిన సేవలను కోవింద్‌ కొనియాడారు. వర్ధమాన క్రీడాకారులకు లారా ఓ రోల్‌ మోడల్‌ అని ఆయన కితాబిచ్చారు.

మరిన్ని వార్తలు