అతను నిలబడితే ‘రన్‌’రంగమే..!!

12 Apr, 2018 13:51 IST|Sakshi
బ్రియాన్‌ లారా (పాత ఫోటో)

2004 ఏప్రిల్‌ 12న  ప్రపంచ రికార్డు

400 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన లారా

రెండు సార్లు ఇంగ్లండ్‌పైనే పరుగుల వరద

సాక్షి, హైదరాబాద్‌ : అతనో లెజండరీ.. ప్రత్యర్థిని పరుగుల వరదలో ముంచిన అలుపులేని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసి నాటౌట్‌ నిలిచిన కరేబియన్‌ పోరాట యోధుడు. అతడే వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా. 2004వ సంవత్సంరం ఇదే రోజున వెస్టిండీస్‌లోని సెయింట్‌ జాన్స్‌ పట్టణంలో లారా టెస్టు క్రికెట్లో అనిర్వచనీయమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆంటిగ్వా క్రికెట్‌ స్టేడియంలో 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో అతను ఈ ఫీట్‌ను సాధించాడు. అప్పటికే మూడు మ్యాచ్‌లలో పరాజయం పాలైన పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంది. కానీ​, బ్రియాన్‌ పరుగుల వరదతో గెలుపు మాట అటుంచి డ్రా కోసం పాకులాడింది.

ఇచ్చాడు.. లాక్కున్నాడు
1994లో ఇంగ్లండ్‌పై 375 పరుగులు చేసి టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును లారా తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ హెడెన్‌ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేసి లారా రికార్డుని బ్రేక్‌ చేశాడు. ఏడాది తిరక్కుండానే 2004లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లారా హెడెన్‌ రికార్డును చెరిపేశాడు. తనకు తానే పోటీ అని నిరూపించుకున్నాడు. సరిగ్గా పదేళ్ల తర్వాత (2004లో) అదే జట్టుపై అదే గ్రౌండ్‌లో లారా ఈ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడడం విశేషం.

ప్రత్యర్థికి అవకాశమిచ్చాడు..
ఈ మ్యాచ్‌ మొదటి రోజు 86 పరుగులు చేసిన లారా.. రెండో రోజు చెలరేగిపోయాడు. ట్రిపుల్‌ సెంచరీ (313 పరుగులు) సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. మూడో రోజు మరో 87 పరుగులు జోడించి 400 మార్కుని చేరుకుని అజేయంగా నిలిచాడు. అదే సమయంలో వెస్టిండీస్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 751 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రత్యర్థికి ఆడే అవకాశం ఇవ్వడానికి లారా తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్డ్‌ చేశాడు.

13 గంటల ‘రన్‌’రంగం..
202 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోయిన లారా 582 బంతులెదుర్కొని 43 ఫోర్లు, నాలుగు సిక్స్‌ర్లతో క్వాడ్రపుల్‌(400 పరుగులు) సెంచరీ సాధించాడు. 13 గంటల పాటు ‘రన్‌’రంగం చేశాడు. లారా దుర్బేధ్యమైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు ఫాలో ఆన్‌ తప్పలేదు. అయితే తగినంత సమయం లేకపోవడంతో వెస్టిండీస్‌కు విజయం దూరమైంది. మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ అత్యధిక పరుగుల వీరుడు (501 నాటౌట్‌) లారానే కావడం కొసమెరుపు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యూఎస్‌ ఓపెన్‌ ఎరీనా ఇప్పుడు హాస్పిటల్‌! 

గుండుతో వార్నర్‌.... 

రోహిత్‌ విరాళం రూ. 80 లక్షలు

ధోనికంటే ‘దాదా’నే నాకు గొప్ప! 

ఐపీఎల్‌ లేకపోతే ఎలా? 

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది